close

క్రైమ్

అబార్షన్‌కు యత్నం.. వికటించిన వైద్యం

 మరణించిన యువతిపై పెట్రోలు పోసి నిప్పు
 మిస్టరీ వీడిన పరిగి మృతదేహం కేసు

పరిగి, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం రంగంపల్లి శివారులో పెట్రోల్‌ పోసి యువతిని కాల్చివేసిన కేసు మిస్టరీ వీడింది. పరిగి డీఎస్పీ బి.రవీంద్రారెడ్డి మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం కలబుర్గికి చెందిన ఇస్తేరాణి శిభ (22) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఓ యువకుడిని ప్రేమించింది. ఆమె ఆర్నెల్ల గర్భవతి కావడంతో కలబుర్గిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో అబార్షన్‌ చేయించేందుకు ప్రేమికుడు తీసుకువెళ్లాడు. వైద్యం వికటించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ప్రేమికుడు తన స్నేహితుని సహకారంతో ఈనెల 4వతేదీ తెల్లవారుజామున కారులో తీసుకువచ్చారు. రంగంపల్లి శివారులోని బీజాపూర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి సమీపాన మృతదేహాన్ని పడేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పరిగి పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందించగా లాభం లేకపోయింది. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆరా తీయగా గుల్బర్గ జిల్లా బ్రహ్మపూర్‌ పోలీసు స్టేషన్‌లో యువతి అదృశ్యం కేసు నమోదైందని సమాచారం వచ్చింది. దీంతో ఆమెను కర్ణాటక వాసిగా పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో ఆసుపత్రికి సంబంధించిన దుప్పటి దొరకడంతో మిస్టరీ వీడింది. ఈ కేసును ఆ స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు