close

తెలంగాణ

ప్రతిఒక్కరూ ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలి

 వ్యాధుల నివారణలో భాగస్వాములు కావాలి
పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌
 ప్రగతిభవన్‌లో పారిశుద్ధ్య కార్యక్రమం ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తమ సొంత ఇళ్ల నుంచే పారిశుద్ధ్య నిర్వహణను చేపట్టి ఆదర్శంగా నిలవాలని పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లోనూ దోమల నివారణ చర్యలకు పూనుకోవాలన్నారు. ఇంటింటా చైతన్యం, ప్రతిఒక్కరి భాగస్వామ్యంతోనే వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. మంగళవారం తన నివాస గృహమైన ప్రగతిభవన్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలను కేటీఆర్‌ ప్రారంభించారు. భవన్‌ ప్రాంగణంలోని పరిసరాలను ఆయన తనిఖీ చేశారు. తొట్లు, వివిధ ప్రదేశాల్లో నిల్వ ఉన్న నీటిని స్వయంగా తీసి వేశారు. భవనం మూలల్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించారు. దోమల నివారణకు పలుచోట్ల నీటి తొట్లలో నూనెను వేశారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, శాసనసభ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘పారిశుద్ధ్య లోపమే వ్యాధులకు కారణం. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధాన సమస్యలు ఇళ్లల్లో, పరిసరాల్లో ఉంటున్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించాలి.. ఇళ్ల ముందు, ఇంటి లోపల నీటిని నిల్వ చేయరాదు. నిరుపయోగ వస్తువులు దోమలకు ఆవాసంగా ఉన్నాయి. వాటిని పూర్తిగా తొలగించాలి’’ అని అన్నారు.

రోజూ 2 గంటల ఉచిత ఓపీకి వినతి
బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: విషజ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక బాధ్యతగా ప్రతి రోజు 2 గంటల పాటు ఉచిత ఔట్‌పేషెంట్‌ సేవలను నిర్వహించాలని.. కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలకు తెలంగాణ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంల అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. తమ సంఘంలో భాగస్వాములైన ఆసుపత్రుల్లో ఈ సేవలు నిర్వహించేందుకు నిర్ణయించామని, మిగతా ఆసుపత్రులూ ముందుకు రావాలని విన్నవించింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వై.రవీందర్‌రావు, కోశాధికారి డాక్టర్‌ ఎల్‌.సురేశ్‌గౌడ్‌ తదితరులు మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు