close

బిజినెస్‌

గూగుల్‌ ఏఐ పరిశోధనా ప్రయోగశాల

దిల్లీ: కృత్రిమమేధ (ఏఐ) పరిశోధనా ప్రయోగశాలను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. గూగుల్‌ రీసెర్చ్‌ ఇండియా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెంట్‌ ల్యాబ్‌గా వ్యవహరించే ఈ కేంద్రంలో కంప్యూటర్‌ సైన్స్‌, ఏఐ లలో పరిశోధన చేస్తారు. భారత్‌ కోసం ఉత్పత్తులు రూపొందించడంతో పాటు అంతర్జాతీయ విపణులకూ వాటిని విస్తరింప చేయాలన్నది తమ ప్రణాళికగా సంస్థ వివరించింది. గూగుల్‌కు చెందిన ఏఐ శాస్త్రవేత్త మనీశ్‌ గుప్తా బృందంతో పాటు, దేశవ్యాప్తంగా పరిశోధనల్లో నిమగ్నమైన వారితో కూడా కంపెనీ భాగస్వామ్యం ఏర్పరచుకుంటుంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్యా రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలు అన్వేషించడమే ధ్యేయమని తెలిపింది. ప్రపంచస్థాయి ఇంజినీరింగ్‌ నిపుణులున్న భారత్‌, ఏఐ ద్వారా భారీ సవాళ్లకు పరిష్కారాలు చూపగలదని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సేన్‌ గుప్తా పేర్కొన్నారు. టాటా ట్రస్ట్స్‌తో కలిపి ఇంటర్నెట్‌ సాథీ కార్యక్రమం కింద 80,000 మందికి శిక్షణ ఇచ్చామని, వారు మరో 3 కోట్ల మంది మహిళలకు అవగాహన కల్పించారని వివరించారు.

కొత్త ఉత్పత్తులు ఇవే..
* గూగుల్‌ పేలో టోకెనైజ్డ్‌ కార్డ్స్‌ను ప్రవేశ పెడతున్నారు. వాస్తవ డెబిట్‌/క్రెడిట్‌ కార్డ్‌ సంఖ్య నమోదు చేయకుండా, డిజిటల్‌ టోకెన్‌తో చెల్లింపునకు ఇది ఉపకరిస్తుంది.
* చిన్నస్థాయి ఉద్యోగాల అన్వేషణకు తోడ్పడేలా జాబ్‌స్పాట్‌ను కూడా గూగుల్‌పేలో అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకోసం స్విగ్గీ, జొమాటో, డుంజో, ఫ్యాబ్‌హోటల్స్‌ వంటి వాటితో జట్టు కట్టింది.
* చిన్న వ్యాపారుల కోసం గూగుల్‌పే ఫర్‌ బిజినెస్‌ పేరిట మరో యాప్‌ అభివృద్ధి చేస్తోంది. డిజిటల్‌ చెల్లింపులకు దోహదపడే ఈ యాప్‌ సేవలు ఉచితం.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు