close

బిజినెస్‌

మార్కెట్‌ బేర్‌మంది

మందగమనంపై భయాలే కారణం
7 నెలల కనిష్ఠానికి నిఫ్టీ
రూ.1.65 లక్షల కోట్ల సంపద ఆవిరి

మార్కెట్‌ మళ్లీ బేర్‌ గుప్పిట్లో చిక్కుకుంది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో వృద్ధి తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ మందగమనంపై భయాలు పెరిగాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ.. భవిష్యత్‌ రేట్లపై వ్యాఖ్యలు మదుపర్లను కలవరపెట్టింది. స్వల్పకాలిక వడ్డీ రేట్లపై పట్టు కోసం అమెరికా మనీ మార్కెట్లలో ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ న్యూయార్క్‌ పెట్టుబడులు కొనసాగించింది. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ రేట్లు మార్చలేదు. విదేశీ మదుపర్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగాయి. ఫలితంగా నిఫ్టీ 7 నెలల కనిష్ఠానికి పడిపోయింది. అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా షేర్లు సానుకూలంగా ట్రేడయ్యాయి.  మార్కెట్‌ నష్టాల నేపథ్యంలో బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.1.65 లక్షల కోట్లు తగ్గి రూ.138.54 లక్షల కోట్లకు పరిమితమైంది.

కీలక స్థాయిల దిగువకు..
సెన్సెక్స్‌ ఉదయం 36,613.93 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఏదశలోనూ కోలుకోలేదు.చివరకు 470.41 పాయింట్ల నష్టంతో 36,093.47 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ సైతం 135.85 పాయింట్లు కోల్పోయి 10,704.80 వద్ద ముగిసింది.
* యెస్‌ బ్యాంక్‌ ఢమాల్‌: ఆల్టికో రుణ వాయిదాలు చెల్లించడం విఫలం కావడంతో రుణాలిచ్చిన బ్యాంకులకు ఇబ్బందులు తప్పకపోవచ్చన్న మూడీస్‌ నివేదిక నేపథ్యంలో యెస్‌ బ్యాంక్‌ షేరు కుదేలైంది. ఇంట్రాడేలో 17.23 శాతం పతనమై రూ. 53.05 వద్ద ఏడాది కనిష్ఠానికి చేరింది. చివరకు 15.52 శాతం కోల్పోయి రూ.54.15 వద్ద ముగిసింది.
* 2019-20లో దేశ ఉక్కు వినియోగం తగ్గొచ్చని ఇక్రా పేర్కొనడంతో  సెయిల్‌ 4.64%, జిందాల్‌ స్టీల్‌ 4.38%, టాటా స్టీల్‌ 3.66%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 0.20% మేర నష్టాలు నమోదు చేశాయి.
* ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ నుంచి వేరుపడిన ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ షేరు తొలిరోజు.5% లాభంతో రూ.1260 వద్ద ముగిసింది.
* ఇ-సిగరెట్లపై ప్రభుత్వం నిషేధం విధించడంతో బుధవారం పెరిగిన సిగరెట్‌ కంపెనీల షేర్లు.. గురువారం మిశ్రమంగా ముగిశాయి. గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ 2.81%, ఐటీసీ 1.19% నష్టపోయాయి. ఇక గోల్డెన్‌ టొబాకో 4.19%, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ 0.21% మేర పెరిగాయి.
* సెన్సెక్స్‌ 30లో 4 షేర్లు మాత్రమే సానుకూలంగా ముగిశాయి. టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ 1.97% వరకు లాభపడ్డాయి.
* టెలికాం మినహా అన్ని రంగాల సూచీలు నేలచూపులు చూశాయి. ఇంధన, చమురు- గ్యాస్‌, బ్యాంకింగ్‌, లోహ, స్థిరాస్తి, వాహన, ఆరోగ్య సంరక్షణ, టెక్‌, ఐటీ 2 శాతం మేర పడ్డాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు