close

బిజినెస్‌

ప్రపంచ ఔషధ విపణిలో 60% వాటా

మూడేళ్లలో సాధిస్తాం
నాణ్యతా ప్రమాణాలు పటిష్ఠం చేస్తున్నాం
డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ వి.జి.సోమానీ
ఈనాడు - హైదరాబాద్‌

ప్రపంచ విపణికి అవసరమైన ఔషధాల్లో 60 శాతం మేరకు మనదేశం నుంచి సరఫరా చేయగలిగే పరిస్థితిని మూడేళ్లలో సాధిస్తామని భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) వి.జి. సోమానీ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ ఔషధ విపణిలో మన వాటా 40 శాతమని తెలిపారు. సులభతర వాణిజ్య విధానాలు అనుసరించడం, నాణ్యతా ప్రమాణాలు బలోపేతం చేయటం, శిక్షణ- నియంత్రణ విభాగాలపై దృష్టి సారించడం ద్వారా మన వాటా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఫార్మాగ్జిల్‌ (ఫార్మాస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌) సారథ్యంలో గురువారం ఇక్కడ ప్రారంభమైన అంతర్జాతీయ ఔషధ నియంత్రణ సంస్థల సదస్సులో వి.జి.సోమానీ ప్రసంగించారు. ఔషధ నియంత్రణ కార్యకలాపాల్లో పూర్తి పారదర్శకత కోసం ఈ సేవలన్నీ ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రెండేళ్లలో పూర్తిస్థాయిలో ఇది అమలవుతుందని వెల్లడించారు. ఔషధ నియంత్రణ సంస్థల ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు పూర్తిస్థాయి అకాడమీ నెలకొల్పినట్లు, తద్వారా ఈ విభాగంలో ఉన్నత ప్రమాణాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇ-ఫార్మసీలను అనుమతించే విషయమై ముసాయిదా ప్రభుత్వ పరిశీలనలో ఉందని, తుది నిర్ణయానికి రావలసి ఉందని పేర్కొన్నారు. వీటిని అనుమతించే విషయంలో దేశీయ ఔషధ రిటైలర్ల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వస్తున్నందున, సమతౌల్యం పాటించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు తెలియజేశారు.

‘వల్‌సార్టాన్‌’లో మలినాల అంశాన్ని పరిశీలిస్తున్నాం

రక్తపోటును అదుపులో ఉంచటానికి వినియోగించే ఔషధమైన ‘వల్‌సార్టాన్‌’ లో కొన్ని మలినాలు ఉన్న అంశంపై తాము పరిశీలన చేపట్టినట్లు వి.జి.సోమానీ వెల్లడించారు. మనదేశానికి చెందిన అలెంబిక్‌ ఫార్మా, అరబిందో ఫార్మా, హెటెరో ల్యాబ్స్‌, జుబిల్యాంట్‌ జనరిక్స్‌, లుపిన్‌, మెక్లాయిడ్‌ వంటి కంపెనీలు ఈ ఔషధాన్ని అమెరికాలో విడుదల చేశాయి. కానీ నైట్రోసోడిమెథైలమైన్‌ (ఎన్‌డీఈఏ) అనే మలినాన్ని (ఇంప్యూరిటీ) గుర్తించాక పలు కంపెనీలు ఈ ఔషధాన్ని ఉపసంహరించాయి. మనదేశంలో ఔషధ నియంత్రణ సంస్థ అయిన డీసీజీఐ దీనిపై దృష్టి సారించింది. ‘§సాధారణంగా కొన్ని బ్యాచ్‌ ఔషధాల్లో మలినాలు కనిపించవచ్చు, అయినా మేం దీన్ని విశ్లేషిస్తున్నాం’ అని సోమానీ పేర్కొన్నారు. మా వద్ద ఉన్న రసాయన నిపుణులు ఈ ఔషధాన్ని పరిశీలిస్తున్నారని వివరించారు. ‘వల్‌సార్టాన్‌’ ఔషధానికి అనుమతి ఇచ్చే దశలో ఈ మలినాలను గుర్తించలేదని,  ఆ తర్వాత విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

నియంత్రణ సంస్థల సమ్మేళనం 

ప్రపంచంలోని ముఖ్యమైన ఔషధ నియంత్రణ సంస్థల ప్రతినిధులందరినీ ఒక వేదిక మీదకు తీసుకురావటం, వివిధ దేశాల్లోని ఔషధ నియంత్రణ ప్రమాణాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ భాస్కర్‌ తెలిపారు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లోని 23 దేశాల ఔషధ నియంత్రణ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరైనట్లు వెల్లడించారు. ఔషధ నాణ్యత, తక్కువ ఖర్చులో తయారు చేయడం, వివిధ దేశాల్లోని నియంత్రణ ప్రమాణాల తీరుతెన్నులు, ఎగుమతి నిబంధనలు... తదితర వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ సదస్సు వీలుకల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫార్మాగ్జిల్‌ వైస్‌ఛైర్మన్‌ సహీల్‌ ముంజాల్‌, జాయింట్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ, రెగ్యులేటరీ వ్యవహారాల అధికారి ప్రసన్నలక్ష్మి, ఔషధ పరిశ్రమలు ప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు చెందిన డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్లు దీనికి హాజరయ్యారు. 

నాణ్యతకు పెద్దపీట

దేశీయ ఔషధ పరిశ్రమ నాణ్యతకు పెద్దపీట వేస్తోందని ఫార్మాగ్జిల్‌ ఛైర్మన్‌ దినేష్‌ దువా పేర్కొన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా జనరిక్‌ ఔషధాల తయారీలో భారతదేశం క్రియాశీలకంగా ఉంది, అందువల్ల నాణ్యత విషయంలో రాజీలేదు, దానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని ఈ సదస్సులో ఆయన వివరించారు. దేశీయ ఔషధ సంస్థ జైడస్‌ క్యాడిల్లా దాదాపు రెండు దశాబ్దాల క్రితమే క్యూఎంఎస్‌ (క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌), క్యూబీడీ (క్వాలిటీ బై డిజైన్‌) సంప్రదాయాలను ప్రవేశపెట్టిందని, ఇదే పద్ధతిని దేశీయంగా ఎన్నో ఔషధ కంపెనీలు అనుసరిస్తున్నాయని తెలిపారు. ‘కొన్ని కంపెనీలు నాణ్యతను విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండవచ్చు, వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలి’ అన్నారాయన. ఔషధాల తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు సాధించటం అనేది ఔషధ నియంత్రణ సంస్థలకు మాత్రమే సంబంధించిన అంశం కాదని, దీన్లో పరిశ్రమ- ఫార్మా కంపెనీలకే ప్రధాన బాధ్యత ఉందని తెలిపారు. మనదేశంలో గతంలో నాణ్యతా సమస్యలు ఉండేవని, ఇటీవల కాలంలో నాణ్యత విషయంలో పెద్దగా విమర్శలు రావటం లేదని అన్నారు. ఈ విషయంలో ఎంతో ప్రగతి సాధించినట్లు వివరించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు