close

బిజినెస్‌

ఏదోకటి తేల్చేయండి

ఇంకా నాన్చితే పండగ సీజన్‌ సున్నానే
జీఎస్‌టీ రేట్లపై టాటా మోటార్స్‌, ఫాడా
జీఎస్‌టీ మండలి కీలక సమావేశం నేడే

దిల్లీ: నేడు జరిగే జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) మండలి సమావేశంలో వాహనాలపై జీఎస్‌టీ రేటు తగ్గించే విషయంపై ఏదోక స్పష్టమైన ప్రకటన చేయాలని టాటా మోటార్స్‌, వాహన డీలర్ల సంఘం (ఫాడా) ప్రభుత్వాన్ని కోరాయి. జీఎస్‌టీ తగ్గుతుందేమోననే ఆశతో ప్రజలు కొనుగోళ్లు వాయిదా వేస్తున్నారని, ఆర్డర్లు వెనక్కి తీసుకుంటున్నారని తెలిపాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పండుగ అమ్మకాలు కూడా సరిగా ఉండవని ఆందోళన వ్యక్తం చేశాయి. ‘జీఎస్‌టీ రేటు తగ్గించినా.. తగ్గించకున్నా వాహన పరిశ్రమ మనుగడ సాధిస్తుంది. అయితే ఏదోక కచ్చితమైన ప్రకటన మాత్రం చేయాల్సి అవసరమైతే ఉంద’ని టాటా మోటార్స్‌ ఎండీ గుంటెర్‌ బషెక్‌ అన్నారు. జీఎస్‌టీ రేటు నిర్ణయంపై అస్పష్టత కొనసాగితే పండుగ అమ్మకాలపైనా ప్రభావం చూపుతుందనేది తమ ఆందోళన అని పేర్కొంటూ వాహనాల డీలర్ల సంఘం ఫాడా (ఎఫ్‌ఏడీఏ) ప్రెసిడెంట్‌ ఆశిష్‌ హర్షరాజ్‌ కలే ఆర్థిక మంత్రి లేఖ రాశారు.  స్పష్టమైన నిర్ణయం వెలువడితే కొనుగోలుదార్ల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. వాహనాలపై జీఎస్‌టీ రేటును దశలవారీగా తగ్గించే అంశాన్ని పరిశీలించాలని హీరో మోటోకార్ప్‌ ప్రభుత్వాన్ని కోరింది. మొదటి దశలో ద్విచక్ర వాహనాలకు తగ్గించి.. కార్లు, ఇతర వాహనాలపై తదుపరి దశలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

వేటికి ఊరట..?
జీఎస్‌టీ రేట్లు తగ్గిస్తే బావుంటుందని అని పలు రంగాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. అత్యంత కీలకమైన జీఎస్‌టీ మండలి 37వ సమావేశం నేడు జరగనుంది.  కేంద్ర, రాష్ట్రాల ఆదాయ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని జీఎస్‌టీ మండలి ఏయే రంగాలకు ఊరటనిస్తుందో.. ఏయే రంగాలకు నిరాశ మిగులుస్తుందో వేచిచూడాలి. ఫిట్‌మెంట్‌ కమిటీ సిఫారసుల ప్రకారం చూస్తే  ఆతిథ్య రంగం మినహా వేటికీ సానుకూల ప్రకటనలు రాకపోవచ్చని అర్థమవుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటుకలు, ఇసుక, రాతి తవ్వకాల కార్యకలాపాలు నిర్వహించే వారికి పన్ను రేటు పెంచి, ప్రత్యేక కాంపోజిషన్‌ పథకాన్ని తీసుకొచ్చే అంశాన్ని జీఎస్‌టీ మండలి పరిశీలించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు