close

బిజినెస్‌

400 జిల్లాల్లో బ్యాంకుల రుణమేళాలు

ఎన్‌బీఎఫ్‌సీలు, రుణ గ్రహీతలతో సమావేశాలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: రైతులు, గృహ కొనుగోలుదార్లు, ఇతరత్రా రుణాలు తీసుకునేవారికి రుణ అవకాశాలు కల్పించే నిమిత్తం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), చిన్న రుణ గ్రహీతలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు సమావేశాలు నిర్వహించనున్నాయి.   400 జిల్లాల్లో రెండు దశల్లో ఈ రుణ మేళాలు జరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం తెలిపారు. మొదటి దశలో అక్టోబరు 3 నుంచి 7 వరకు 200 జిల్లాల్లో, రెండో దశలో అక్టోబరు 11 నుంచి 200 జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. పండగ సీజనుల్లో ఎక్కువ మందికి రుణాలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసినట్లు చెప్పారు. ఈ సమావేశాల్లో వ్యవసాయ, ఎంఎస్‌ఎమ్‌ఈ, గృహ, రిటైల్‌ రంగాలకు రుణాలు ఇస్తారని తెలిపారు.

ఎంఎస్‌ఎంఈ రుణాలను మార్చి వరకు ఎన్‌పీఏగా ప్రకటించొద్దు: ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈ రుణాలను 2020 మార్చి వరకు నిరర్థక ఆస్తులుగా ప్రకటించవద్దని బ్యాంకుల్ని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల అధిపతులతో సమావేశమైన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఒత్తిడికి గురైన ఎంఎస్‌ఎంఈల రుణ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించవద్దని ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సర్య్కులర్‌ జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఎంఎస్‌ఎంఈ రుణాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించకపోతే ఈ రంగానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది. ఎంపిక చేసిన ఎన్‌బీఎఫ్‌సీలకు ద్రవ్యలభ్యత, రుణ సదుపాయాలు కల్పించమ’ని ఆర్థిక మంత్రి సూచించారు.


మరిన్ని రేట్ల కోతలకు అవకాశం
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: కీలక రేట్లను ఇంకా తగ్గించడానికి అవకాశం ఉందని రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. వృద్ధి తగ్గుతూ వస్తుండటం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటాన్ని ఇందుకు కారణాలుగా తెలిపారు. వృద్ధి పుంజుకోవడానికి చర్యలు చేపట్టాలంటే ప్రభుత్వానికి ద్రవ్యలోటు వంటి అడ్డంకులు ఉన్నాయని, దీంతో మూలధన వ్యయం ఒక్కటే పరిష్కారమని అన్నారు. గతేడాది డిసెంబరు నుంచి శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆర్‌బీఐ వరుసగా నాలుగు సార్లు కీలక రేట్లలో కోత వేసింది.

చమురు సంక్షోభం ప్రభావం స్వల్పమే: సౌదీ అరేబియాలో ఏర్పడిన తాత్కాలిక చమురు సంక్షోభం వల్ల ధరలు కొంత పెరిగినా, ఈ ప్రభావం దేశీయంగా ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటులపై పరిమితంగానే ఉండొచ్చని దాస్‌ పేర్కొన్నారు. బ్లూమ్‌బర్గ్‌ ఇండియా ఆర్థిక సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి స్వల్ప శ్రేణిలో కదలాడిందని, మొదటి త్రైమాసికంలో బలపడగా, ఆగస్టు, సెప్టెంబరులో స్వల్పంగా బలహీనపడిందని వెల్లడించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు