close

క్రీడలు

సింధుకు షాక్‌

క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
చైనా ఓపెన్‌
చాంగ్‌జౌ (చైనా)

చైనా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్‌ సింధు 21-12, 13-21, 19-21తో పోర్న్‌పావీ చొచువాంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం చవిచూసింది. 58 నిమిషాల వరకు హోరాహోరీగా సాగిన పోరులో చివరికి ప్రత్యర్థిదే పైచేయి అయింది. ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు.. పోర్న్‌పావీ (15వ ర్యాంకు) చేతిలో ఓడటం ఇదే తొలిసారి. గతంలో వీరిద్దరు మూడు సార్లు తలపడ్డారు. మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించిన సింధు 7-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత తడబడినా 11-10తో విరామానికి వెళ్లింది. ఆ తర్వాత చెలరేగి ఆడి వరుసగా 8 పాయింట్లు గెలుచుకుని 19-11తో ఆధిపత్యం చలాయించింది. అదే జోరులో తొలి గేమ్‌ నెగ్గింది. రెండో గేమ్‌లో నిరాశ తప్పలేదు. ఆరంభం నుంచి జోరు ప్రదర్శించిన పోర్న్‌పావీ.. సింధుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఆసక్తికరంగా సాగింది. ఒక దశలో 6-6తో స్కోరు సమమైంది. పుంజుకున్న సింధు 11-7తో విరామానికి వెళ్లింది. జోరు కొనసాగించిన తెలుగమ్మాయి గేమ్‌ గెలిచేందుకు చేరువైంది. అయితే 19-15తో మ్యాచ్‌కు రెండు పాయింట్ల దూరంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి నుంచి ఆమెకు అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఊహించని రీతిలో వరుసగా ఆరు పాయింట్లు నెగ్గిన పోర్న్‌పావీ.. సింధుకు షాకిచ్చింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌ 21-19, 21-19తో గ్వాంగ్‌ జు (చైనా)పై గెలిచాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- అశ్విని 11-21, 21-16, 12-21తో కనెకొ- మిసాకి (జపాన్‌) చేతిలో, పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ 19-21, 8-21తో కముర- సొనోడా (జపాన్‌) చేతిలో ఓడారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు