close

క్రీడలు

బజ్‌రంగ్‌ కొద్దిలో..

సెమీస్‌లో పరాజయం
అయినా టోక్యో బెర్తు సొంతం
ఒలింపిక్స్‌కు రవి అర్హత
ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌

భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియాను దురదృష్టం వెన్నాడింది.. ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవాలనే అతని కల భగ్నమైంది.. సర్వశక్తులూ ఒడ్డినా ఈ యోధుడు ఫైనల్‌ చేరలేకపోయాడు. వివాదాస్పద రీతిలో సెమీస్‌ బౌట్‌ను చేజార్చుకున్నాడు. అయితే టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు సంపాదించడం, కాంస్యం కోసం ఇంకా పోటీలో నిలవడం బజ్‌రంగ్‌కు ఊరట. అతనితో పాటు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రవి దహియా కూడా.. కాంస్యం కోసం రేసులో నిలిచాడు. రియో ఒలింపిక్స్‌లో కంచు గెలిచిన సాక్షి మలిక్‌ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టడం నిరాశ కలిగించే అంశం.

నూర్‌ సుల్తాన్‌

భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు సంపాదించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌ చేరడం ద్వారా అతను టోక్యో టిక్కెట్‌ ఖరారు చేసుకున్నాడు. ఈ ప్రపంచ నంబర్‌వన్‌ అద్భుత పోరాటం చేసినా.. సెమీఫైనల్లో ఓడడంతో కాంస్యం కోసం పోరాడనున్నాడు. గురువారం హోరాహోరీగా సాగిన పురుషుల 65 కేజీల విభాగం సెమీఫైనల్లో బజ్‌రంగ్‌ 9-9తో దౌలత్‌ నిజయ్‌బెకోవ్‌ (కజకిస్థాన్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. స్కోరు సమం అయినా ఒకే ప్రయత్నంలో ఎక్కువ పాయింట్లు (4) సాధించిన దౌలత్‌నే రిఫరీలు విజేతగా ప్రకటించారు. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవాలనే బజ్‌రంగ్‌ ఆశ ఆవిరైంది. శుక్రవారం జరిగే కాంస్య పోరులో అతను.. ఇస్మాయిల్‌ (హంగరీ)తో తలపడనున్నాడు. సెమీస్‌ చేరిన మరో రెజ్లర్‌ రవి దహియా (57 కేజీలు) టోక్యో బెర్తు సంపాదించాడు. ఈ క్రమంలో అతను ఐరోపా ఛాంపియన్‌ అర్సెన్‌ (ఆర్మేనియా), ప్రపంచ 3వ ర్యాంకర్‌ యుకి తకహషి (జపాన్‌)లకు షాకిచ్చాడు. అయితే సెమీస్‌లో రవి పోరాడినా 3-5తో సులేమాన్‌ (టర్కీ) చేతిలో ఓడాడు. మహిళల 62 కేజీల విభాగంలో సాక్షి మలిక్‌ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఆమె 7-10తో అదెనిని (నైజీరియా) చేతిలో ఓడింది.

పునియాకు అన్యాయం!
హోరాహోరీగా సాగిన సెమీస్‌లో ఆరంభంలో 0-2తో వెనకబడిన బజ్‌రంగ్‌ ఆ తర్వాత 2-2తో స్కోరు సమం చేశాడు. కానీ మ్యాట్‌ బయట ప్రత్యర్థిని పట్టి పడేసినందుకు స్థానిక ఆటగాడు దౌలత్‌కు రిఫరీ నాలుగు పాయింట్లు రివార్డుగా ఇవ్వడం బజ్‌రంగ్‌ను ఖిన్నుడిని చేసింది. ‘‘మ్యాట్‌ అంచు నుంచి ప్రత్యర్థిని విసిరే ప్రయత్నం చేసిన బజ్‌రంగ్‌కు కనీసం రెండు పాయింట్లయినా దక్కాల్సింది. రిఫరీ నిర్ణయాన్ని వెంటనే సవాల్‌ చేసినా ఫలితం దక్కలేదు’’ అని కోచ్‌ బెనింటైడిస్‌ మండిపడ్డాడు. స్థానిక ఆటగాడైన దౌలత్‌ అలసిపోయినప్పుడు కోలుకునేందుకు సమయమిచ్చిన రిఫరీ.. అతడు తప్పులు చేస్తున్నా ఎలాంటి హెచ్చరిక జారీచేయలేదు. బజ్‌రంగ్‌ మ్యాట్‌పై నుంచి పదేపదే అప్పీల్‌ చేసినా ప్రయోజనం లేకపోయింది. దీనిపై బజ్‌రంగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ప్రత్యర్థి పట్టుకి రెండుసార్లు దొరికిపోయి 2-9తో ఓటమి దిశగా సాగాడు. కానీ పట్టువీడకుండా పోరాడిన పునియా.. ఆఖరి సెకన్లలో స్కోరును 9-9తో సమం చేశాడు. అయితే అత్యధికంగా ఒకేసారి నాలుగు పాయింట్లు సాధించిన దౌలత్‌నే రిఫరీ విజేతగా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో కోపంతో ఊగిపోయిన బజ్‌రంగ్‌ కోచ్‌ షంకో.. తన స్కోరింగ్‌ బ్లాక్‌ను మ్యాట్‌పైకి విసిరేసి నిరసన తెలియజేశాడు. మ్యాట్‌ ఛైర్మన్‌ స్థానిక ఆటగాడికి అనుకూలంగా వ్యవహరించాడని భారత కోచ్‌ ఒకరు విమర్శించాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు