close

ఆంధ్రప్రదేశ్

ఆ లెక్క ఉండాల్సిందే

కాల్వల ద్వారా మళ్లించే వరదనీటిపై ఏపీ వాదనను అంగీకరించని తెలంగాణ
కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: వరద ప్రవాహం సముద్రంలోకి వెళ్తున్నప్పుడు కాలువల ద్వారా మళ్లించే నీటిని లెక్కలోకి తీసుకోరాదన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనను తెలంగాణ అంగీకరించలేదు. ఎవరు ఎంత నీటిని తీసుకున్నదీ లెక్క ఉండాల్సిందేనని, వరద ఉన్నప్పుడు తీసుకున్న నీటిపై ఏడాది చివర్లో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. కాలువల నుంచి తీసుకొనే నీటికి, వాస్తవంగా నివేదించే దానికి మధ్య వ్యత్యాసాలు ఉంటున్నందున రెండు రాష్ట్రాల ఇంజినీర్లతో కమిటీలు ఏర్పాటు చేసి పరిశీలింపచేయాలని నిర్ణయించారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఛైర్మన్‌ ఆర్‌.కె.గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్య కార్యదర్శి పరమేశం, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, చీఫ్‌ ఇంజినీర్లు నరసింహ, ఖగేందర్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్లు నారాయణరెడ్డి, జలంధర్‌ పాల్గొన్నారు. కేసీ కాలువ కింద గత ఏడాది వినియోగించిన నీటి లెక్కలను మరోసారి సమీక్షించాలని నిర్ణయించినట్లు తెలిసింది. పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్‌ నుంచి తీసుకొన్న నీటికి ఆయా రాష్ట్రాల నీటిపారుదల శాఖలు నివేదించే లెక్కలకు, బోర్డు లేదా రెండు రాష్ట్రాల ఇంజినీర్లు సంయుక్తంగా పరిశీలించినప్పుడు తేడా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు రెండు రాష్ట్రాల ఇంజినీర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలని, వారు పరిశీలించి ధ్రువీకరించాలని నిర్ణయించారు.  అక్టోబరు, నవంబరు నెల అవసరాలకు ఎంత నీరు అవసరమో ప్రతిపాదనలు ఇవ్వాలని రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులను బోర్డు కోరింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు