close

ఆంధ్రప్రదేశ్

అధికారుల చర్య అక్రమం

తమ 5 ఎకరాల భూమి స్వాధీనంపై హైకోర్టుకు కుటుంబరావు
మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేసిన న్యాయమూర్తి

ఈనాడు, అమరావతి: విజయవాడ మాచవరం గ్రామ పరిధిలో తమకు చెందిన 5.10 ఎకరాల భూమిని అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ రాష్ట్ర ప్రణాళికా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి ఈ వ్యాజ్యంపై గురువారం విచారణ జరిపారు. అనుబంధ పిటిషన్లో ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం(అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌) కింద పిటిషనర్లను మిగులు భూమి కలిగినవారిగా(సర్‌ ప్లస్‌ ల్యాండ్‌ హోల్డర్స్‌) పేర్కొంటూ నిబంధనలకు విరుద్ధంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ముందస్తు నోటీసు ఇవ్వడం, వివరణ కోరడం చేయకుండా నేరుగా భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రహరీగోడను కూల్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మొదటి నుంచి ఈ భూమి వ్యవహారం మోసపూరితంగా జరిగిందన్నారు. ఆ భూమిని దక్కించుకోవడం కోసం పిటిషనర్లు పలుయత్నాలు చేశారని వివరించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తామని దసరా సెలవుల తర్వాత విచారణ జరుపుతామని ప్రతిపాదించారు. అందుకు దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. ఆ భూమిపై మూడో వ్యక్తికి హక్కులు కల్పించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. దీంతో అనుబంధ పిటిషన్‌పై తగిన ఉత్తర్వులిస్తామని పేర్కొంటూ న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు