close

ఆంధ్రప్రదేశ్

చితిలో కాలిన మానవత్వం

చేతబడి అనుమానంతో ఆటోడ్రైవర్‌ సజీవదహనం

ఈనాడు, హైదరాబాద్‌: న్యూస్‌టుడే, శామీర్‌పేట: ఆటోడ్రైవర్‌ చేతబడి చేయడం వల్లే తమ బంధువు మరణించిందని ఆగ్రహించిన కొందరు వ్యక్తులు.. అతడిని కొట్టి, ఆమె చితిమంటల్లోనే తగులబెట్టేశారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట-మూడుచింతలపల్లి మండలం అద్రాస్‌పల్లిలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన గ్యార లక్ష్మి(45) అయిదారేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ ఆంజనేయులు(24) చేతబడి చేయడమే అందుకు కారణమని కుటుంబసభ్యులు అనుమానంతో ఉన్నారు. లక్ష్మి మంగళవారం సాయంత్రం మరణించగా.. గ్రామంలోని చెరువు వద్ద బుధవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. చితి కాలుతుండగా రాత్రి 10 గంటల సమయంలో ఆంజనేయులు అక్కడకు వచ్చాడు. అక్కడే ఉన్న లక్ష్మి బంధువులు తీవ్ర ఆగ్రహంతో అతడిని కర్రలు, రాళ్లతో కొట్టి చితిమంటల్లో పడేశారు. మంటలకు తాళలేక అతడు చితిపై నుంచి లేచి పరుగులు పెట్టాడు. అయినా వారు వదల్లేదు. అతణ్ని పట్టుకుని, లాక్కొచ్చి మళ్లీ చితిలో పడేశారు. నిస్సహాయ స్థితిలో అతడు సజీవదహనమయ్యాడు. ఈక్రమంలో నిందితుల్లో ఒకరికి మంటలు అంటుకుని గాయాలయ్యాయి. లక్ష్మి బావ బాల్‌రామ్‌తోపాటు మరో నర్సింహ, కిష్టయ్య, శ్రీరామ్‌లను పోలీసులు అరెస్టుచేశారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు