close

ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ ముఠా గుట్టురట్టు

500 సిమ్‌కార్డులు జప్తు..ఒకరి అరెస్టు
నెలకు రూ.10 లక్షల మేరకు ఆర్జించినట్లు వెల్లడి
రాజంపేట నేరవార్తలు - న్యూస్‌టుడే

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అడ్డదారిలో అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ దందా నడుపుతున్న ముఠాపై కడప జిల్లా రాజంపేట పట్టణ పోలీసులు గురువారం దాడి చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని దాదాపు 500 సిమ్‌కార్డులను జప్తు చేశారు. సీఐ శుభకుమార్‌ కథనం మేరకు..ఇతర దేశాలకు వెళ్లిన వారు ఇక్కడి వారితో చరవాణి ద్వారా మాట్లాడాలనుకుంటే ప్రభుత్వానికి నిమిషానికి 32 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము చెల్లించే అవసరం లేకుండా ప్రభుత్వం కళ్లుగప్పి అడ్డదారిలో అంతర్జాతీయ కాల్స్‌ మాట్లాడించేందుకు కొంతమంది పథకం వేశారు. ఇందులో భాగంగా విదేశాలలో ఉన్న కొందరు స్థానికంగా కొంతమందిని తమ ప్రతినిధులుగా నియమించుకున్నారు. అంతర్జాలం ద్వారా ఫోన్లు చేస్తే ఇక్కడున్న వారి పరికరంతో అనుసంధానమయ్యేలా చేశారు. అక్కడి నుంచి ఇంటర్నెట్‌ ద్వారా ఫోన్‌ వచ్చినా స్థానికులకు మాత్రం లోకల్‌ నంబర్‌ ద్వారా వచ్చినట్లు కనిపించేలా ఈ విధానాన్ని రూపొందించారు. ఈ క్రమంలో ఆయా దేశాలలో దాదాపు 500 మంది ప్రతినిధులను ఎంచుకొన్నారు. విదేశాలలో ఉన్న వారు తమ బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అక్కడి ప్రతినిధులను సంప్రదిస్తారు. వారు అంతర్జాలం ద్వారా ఇక్కడున్న వారికి కాల్‌ చేస్తారు. ఇక్కడున్న వారి ప్రతినిధులు లోకల్‌ సిమ్‌ ద్వారా ఇక్కడి వారికి కాల్‌ కనెక్ట్‌ చేసి మాట్లాడిస్తారు. ఇందుకు గాను ప్రజల నుంచి భారీగా రుసుము వసూలు చేస్తారు. దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న ఈ తతంగాన్ని ముందుగా హరియాణాలో ఉన్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ ప్రధాన కార్యాలయం అధికారులు గుర్తించారు. అన్ని ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని రాజంపేట ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ కాల్స్‌ వెళ్తున్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. పట్టణంలోని రెడ్డివారివీధికి చెందిన లక్ష్మీనారాయణ తన ఇంటిపై నిర్వహిస్తున్న కేంద్రం ద్వారా ఎక్కువ కాల్స్‌ మాట్లాడుతున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం తనిఖీ చేయగా..500 సిమ్‌కార్డులు వినియోగించి నెలకు రూ.10 లక్షల చొప్పున కొల్లగొట్టినట్లు సీఐ వివరించారు. లక్ష్మీనారాయణ సహాయకుడు మున్నాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు