close

తెలంగాణ

పెరగనున్న వ్యయం.. తగ్గనున్న సామర్థ్యం

నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో ప్రత్యామ్నాయంపై ఇంజినీర్ల అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్‌ ఎత్తు తగ్గించడానికి ప్రయత్నిస్తే నిల్వ సామర్థ్యం తగ్గడంతోపాటు అంచనా వ్యయం సుమారు రూ.120 కోట్లు పెరగనున్నట్లు తెలిసింది. 74 మీటర్ల ఎత్తులో రాక్‌ఫిల్‌డ్యాం నిర్మించడం కంటే ప్రత్యామ్నాయం మేలని కసరత్తు చేయగా, రిజర్వాయర్‌లో మూడు టీఎంసీల మేరకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గనున్నట్లు తెలిసింది. మరోవైపు రెండు కిలోమీటర్లకు పైగా మట్టికట్టను అదనంగా నిర్మించాల్సి వస్తుందని, దీని వల్ల రూ.120 కోట్లు అదనంగా వ్యయమవుతుందని కూడా సంబంధిత ఇంజినీర్ల పరిశీలనలో తేలినట్లు తెలిసింది.

ఇదీ ప్రణాళిక
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా నార్లాపూర్‌ (అంజనగిరి) రిజర్వాయర్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ రిజర్వాయర్‌ కట్ట పొడవు 11.02 కి.మీ. ఇందులో మధ్యలో ఉన్న కొండలు పోను 6.647 కి.మీ దూరం మట్టికట్ట నిర్మించాల్సి ఉంది.
* మొదటి రీచ్‌లో 0 నుంచి 3.375 కి.మీ వరకు 55.575 మీటర్ల ఎత్తుతో మట్టి కట్ట
* రెండో రీచ్‌లో కి.మీ 6.275 నుంచి 6.950 వరకు (675 మీ. దూరం) 74 మీ. ఎత్తుతో రాక్‌ఫిల్‌డ్యాం
* మూడో రీచ్‌లో కి.మీ 8.425 నుంచి కి.మీ 11.022 వరకు (2.597 కి.మీ) 13.38 మీటర్ల ఎత్తుతో మట్టికట్ట నిర్మించాల్సి ఉంది. దీనివల్ల ఈ రిజర్వాయర్‌లో 8.51 టీ¨ఎంసీల నీరు నిల్వ ఉంటుంది.

సగం పని పూర్తి
రూ.760.58 కోట్లతో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టడానికి 2016 జూన్‌లో గుత్తేదారుతో ఒప్పందం జరిగింది. ఇప్పటివరకు సుమారు యాభైశాతం పని జరిగింది. మొదట కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 30 నెలల్లో పనిని పూర్తి చేయాల్సి ఉండగా, తాజాగా 2020 మే వరకు గడువు పొడిగించారు. ఇటీవల ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు పర్యటనకు వెళ్లినపుడు 74 మీటర్ల ఎత్తుతో రాక్‌ఫిల్‌డ్యాం నిర్మించడంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు, ఈ ప్రాంతం వరదవెళ్లే మార్గం (గార్జ్‌)లో ఉన్నందున ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని సంబంధిత ఇంజినీర్లకు సూచించారు. దీనిపై గత కొద్ది రోజులుగా ఇంజినీర్లు కసరత్తు చేస్తున్నారు. 74 మీటర్ల ఎత్తుతో రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మిం0చకపోతే రెండు కిలోమీటర్ల మేరకు అదనంగా మట్టికట్టను నిర్మించాల్సి వస్తుందని తేల్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. దీనివల్ల సుమారు రూ.120 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అంచనాకు వచ్చారు. దీంతోపాటు రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీల మేర తగ్గి సుమారు ఐదున్నర టీఎంసీలు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు