close

ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి ప్రధాని అమెరికా పర్యటన

 22న హ్యూస్టన్‌లో ‘హౌడీ-మోదీ’ సభ
 హాజరుకానున్న ట్రంప్‌

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 27 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కావడంతో పాటు, ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగించనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే గురువారం ఇక్కడ చెప్పారు. శనివారం మోదీ హ్యూస్టన్‌ చేరుకోనున్నారు. ఆదివారం (22న) అక్కడ 50వేల మంది ప్రవాస భారతీయులతో జరిగే ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాల దృష్ట్యా ట్రంప్‌ ఈ కార్యక్రమానికి రానున్నారు. దీనిపై ట్రంప్‌ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సమావేశానికి వెళ్తాను. మోదీ భారీగా జనాన్ని ఆకర్షించారు. సభకు వచ్చే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ‘కొన్ని ప్రకటనలు’ చేస్తాను’’ అని తెలిపారు. తొలుత హ్యూస్టన్‌లోను, అనంతరం న్యూయార్క్‌లోనూ ఇరువురు నేతలు భేటీ అవుతారని అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్‌ శ్రింగ్లా చెప్పారు. ఈ చర్చల్లో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


ప్రధాని పర్యటన వివరాలు

21: హ్యూస్టన్‌లో అమెరికా ఇంధన సంస్థల సీఈవోలతో సమావేశం
22: హ్యూస్టన్‌లో ప్రవాస భారతీయులతో హౌడీ- మోదీ బహిరంగ సభ
23: న్యూయార్క్‌లో వాతావరణ మార్పుల జరిగే సదస్సులో ప్రసంగం
* ఉగ్రవాదంపై జోర్డాన్‌ రాజు ఆధ్వర్యంలో జరిగే సదస్సులో ఉపన్యాసం
24: న్యూయార్క్‌లో అమెరికా బృందంతో ద్వైపాక్షిక చర్చలు
* మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా జరిగే సదస్సులో ప్రసంగం
* బిల్‌-మెలిండా గేట్స్‌ సంస్థ అందించే గ్లోబల్‌ గోల్‌ కీపర్‌ పురస్కారం స్వీకరణ
25: బ్లూంబెర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరంలో కీలక ఉపన్యాసం
* 40 భారీ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం
26: న్యూయార్క్‌లోని స్టేట్‌ యూనివర్సిటీలో గాంధీ శాంతివనం ప్రారంభం
27: ఐరాస సాధారణ సభలో ప్రసంగం. అనంతరం స్వదేశానికి తిరుగు ప్రయాణం.
(పర్యటనలో భాగంగా వివిధ వర్గాలతో మొత్తం 20 ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు.)

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు