close

ఆంధ్రప్రదేశ్

నాసా చిత్రాల్లో కనిపించని విక్రమ్‌

హ్యూస్టన్‌: చంద్రుడిపై ఆచూకీ లేకుండా పోయిన భారత విక్రమ్‌ ల్యాండర్‌ విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. విక్రమ్‌ దిగినట్లుగా భావిస్తున్న ప్రదేశాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌వో) ఉపగ్రహం తన కెమెరాతో క్లిక్‌మనిపించింది. అయితే ఆ ప్రాంతంలో అప్పుడు సాయం సమయం నెలకొని ఉంది. దీంతో పొడవైన నీడలు ఆ ప్రాంతాన్ని ఆవరించాయని ఎల్‌ఆర్‌వో డిప్యూటీ ప్రాజెక్టు సైంటిస్ట్‌ జాన్‌ కెల్లర్‌ చెప్పారు. బిలాల అంచుల నీడలు సమీపంలోని మైదాన ప్రాంతాలకు విస్తరించాయి. ‘‘లక్షిత ల్యాండింగ్‌ ప్రదేశాన్ని ఎల్‌ఆర్‌వో కెమెరా చిత్రీకరించింది. అయితే ల్యాండర్‌కు సంబంధించిన నిర్దిష్ట ప్రదేశం తెలియరాలేదు. ఆ వ్యోమనౌక ఎల్‌ఆర్‌వో కెమెరా దృష్టిలో పడి ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నారు. కొత్త చిత్రాలను పాత వాటితో పోల్చి చూసి, ల్యాండర్‌ ఆచూకీ కోసం తమ బృందం ప్రయత్నిస్తుందని చెప్పారు. నీడ ప్రాంతంలో కానీ, కెమెరా చిత్రీకరించని చోట కానీ ల్యాండర్‌ ఉండొచ్చన్నారు. వచ్చే నెల 14న ఎల్‌ఆర్‌వో తిరిగి ఇదే ప్రదేశానికి వస్తుందని చెప్పారు.

సమయం మించిపోతోంది
విక్రమ్‌తో సంబంధాలు ఏర్పర్చుకోవడానికి ఈ నెల 21 వరకే గడువు ఉంది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో రాత్రి సమయం ప్రారంభమవుతుంది. 14 రోజుల పాటు ఆవరించే ఈ చీకటి వల్ల చెలరేగే మైనస్‌ 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో విక్రమ్‌లోని పరికరాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. అందువల్ల రెండు రోజుల్లో సంబంధాలు ఏర్పరచుకోలేకపోతే ఈ వ్యోమనౌకపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాశ్వతంగా ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు