close

ఆంధ్రప్రదేశ్

రైతు భరోసాకు సర్కారీ ఉద్యోగులు అనర్హులు

ప్రజాప్రతినిధులు కూడా..
10 వేల పింఛను వస్తున్నా వర్తించదు

ఈనాడు, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసాను అక్టోబరు 15 నుంచి అమలుచేసేందుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి భూములున్న ఒక్కో రైతుకు రూ.12,500 చొప్పున ఇస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు రాష్ట్రమే రూ.12,500 ఇస్తుంది. ఈ పథకం మార్గదర్శకాలను గురువారం జారీచేశారు. ఏటా జూన్‌ 1 నుంచి మే 31 దాకా వ్యవసాయ సంవత్సరంగా పరిగణిస్తారు. సెప్టెంబరు 30 లోగా అర్హులను గుర్తించాలి.
* కుటుంబం యూనిట్‌గా పథకం అమలవుతుంది. భార్య, భర్త, పిల్లలను కుటుంబంగా పరిగణిస్తారు. పెళ్లయినవారిని మరో యూనిట్‌గా తీసుకుంటారు.
* ఒక భూయజమాని, ఒక కౌలు రైతు మధ్యే ఒప్పందం కుదుర్చుకోవాలి.
* ఒకే భూయజమాని నలుగురైదుగురితో కౌలు ఒప్పందం చేసుకుంటే అందులో ఒకరినే అర్హులుగా గుర్తిస్తారు.
* అర్హుల జాబితాలను గ్రామపంచాయతీల్లో ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించాలి.

కౌలు రైతులైతే ఎంత భూమి?
* కౌలు రైతులకు సొంత భూమి ఉండకూడదు.
* కుటుంబసభ్యులతో చేసుకునే కౌలు ఒప్పందాలకు పథకం వర్తించదు.
* ఒక కౌలురైతు ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా ఒక యూనిట్‌గానే పరిగణిస్తారు.
* ఒకే గ్రామానికి చెందిన సన్నకారు రైతు, కౌలుదారు మధ్య ఒప్పందాన్ని గుర్తించరు.
* భూయజమానులతో పాటు వాటిని సాగుచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులూ ప్రయోజనానికి అర్హులే.

వీరు అనర్హులు
* సంస్థల పేరుతో భూములున్న వారు
* రాజ్యాంగపదవుల్లో ఉన్న తాజా, మాజీ సభ్యులు, మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మేయర్లు, జడ్పీ ఛైర్మన్లు
* ప్రస్తుత, పదవీవిరమణ చేసిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, అనుబంధ సంస్థలు, స్వతంత్ర సంస్థలు, స్థానిక సంస్థల్లో శాశ్వత ఉద్యోగులు (మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌, నాలుగోతరగతి, గ్రూప్‌ డి ఉద్యోగులకు మినహాయింపు)
* నెలకు రూ.10వేల పైన పింఛను పొందేవారు (మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌, నాలుగో తరగతి, గ్రూప్‌ డి ఉద్యోగులకు మినహాయింపు)
* ఆదాయపు పన్ను చెల్లించినవారు. వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏలు, ఆర్కిటెక్టులు
* వ్యవసాయ భూముల్ని ఇళ్లస్థలాలుగా మార్చుకున్న వారు. ఆక్వా చెరువులు, వ్యవసాయేతర భూముల యజమానులు
* వాణిజ్య, వృత్తిపన్నులు చెల్లించేవారు, గతేడాది జీఎస్టీలో నమోదైనవారు


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు