close

ఆంధ్రప్రదేశ్

కశ్మీర్‌లో కొత్త స్వర్గం నిర్మిద్దాం

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
  మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ప్రారంభం

నాసిక్‌: ఉగ్రవాదంతో అవస్థలు పడుతున్న కశ్మీర్‌లో కొత్త స్వర్గం నిర్మిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సరిహద్దుల ఆవల ఉన్నవారు కశ్మీర్‌లో అల్లర్లు, అపనమ్మకాలను ప్రేరేపించి ఇంతవరకు హింసను సృష్టించారని, దానిని అణచివేయడానికే కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గురువారం ఆయన నాసిక్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త ‘మహా జనాదేశ్‌ యాత్ర’ ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ వారసులు బహూకరించిన తలపాగాను ధరించిన ఆయన తనదైన శైలిలో ప్రసంగిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. తగిన మెజార్టీ లేకున్నా ఫడణవీస్‌ సుస్థిర పాలన అందించారని ప్రశంసించారు. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే..

కశ్మీర్‌వాసులను హత్తుకుందాం
కశ్మీరీ ప్రజల దుస్థితికి కాంగ్రెస్‌ పాలనే కారణం. అక్కడి సమస్యలను పరిష్కరించడానికి దేశ ప్రజల కోరిక మేరకు 370 అధికరణాన్ని రద్దు చేశాం. హింస, ఉగ్రవాదం, వేర్పాటువాదం, అవినీతి అనే విషవలయం నుంచి అక్కడి వారిని కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. కశ్మీర్‌ లోయలో కొత్త స్వర్గాన్ని నిర్మిద్దాం. ప్రతి ఒక్క కశ్మీర్‌వాసినీ హత్తుకుందాం. వారు హింసను కోరుకోవడం లేదు. అభివృద్ధి, ఉద్యోగావకాశాలు కావాలంటున్నారు.

సుప్రీంకోర్టు పరిశీలనలో ‘అయోధ్య’
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి చట్టం తెచ్చేలా ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలని ‘పెద్ద నోరున్న కొందరు’ (పరోక్షంగా మిత్ర పక్షం శివసేనను ఉద్దేశించి) అంటున్నారు. అయితే ఈ విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచాలని వారికి చేతులు జోడించి కోరుతున్నా.

పవార్‌కు ఏమయింది?
కాంగ్రెస్‌ వారు అయోమయంలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అనుభవజ్ఞుడైన శరద్‌ పవార్‌కు ఏమయింది? ఆయన ఎందుకు పొరుగుదేశాన్ని (పాకిస్థాన్‌ను) పొగుడుతున్నారు? ఆ దేశం ఉగ్రవాదుల కర్మాగారమని అందరికీ తెలుసు. కేవలం ఓట్ల కోసం ఆయన తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు.

దేశ రక్షణ పట్టని యూపీయే
గత యూపీయే ప్రభుత్వం దేశ రక్షణను పట్టించుకోలేదు. భద్రతా సిబ్బందికి అవసరమైన 1.86 లక్షల తూటా రక్షక కవచాలను కూడా ఇవ్వలేకపోయింది. 2014 వరకు ఇవి లేకుండానే జవాన్లు సరిహద్దుల్లో పోరాటాలు జరిపారు. ఇప్పుడు వాటిని మనం సమృద్ధిగా తయారు చేస్తుండడంతో పాటు, 100దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.

శివాజీకి ప్రణమిల్లి.. శివసేనకు చురకేసి..

మహారాష్ట్రలో ఎన్నికల కోలాహలం మొదలైంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాని మోదీ గురువారం నాసిక్‌లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహానికి ఇలా నమస్కరించి.. ‘విజయ్‌ సంకల్ప్‌ ర్యాలీ’లో ప్రసంగించారు. మెజారిటీ లేకపోయినా ఐదేళ్ల సుస్థిర పాలన అందించిన ఫడణవీస్‌ను ప్రశంసిస్తూనే పనిలో పనిగా.. అయోధ్య వివాదం సుప్రీంలో ఉన్నందున దానిపై నోరు పెంచొద్దంటూ శివసేనకు చిన్న చురకంటించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు