close

ఆంధ్రప్రదేశ్

ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు

చెన్నై శేఖర్‌రెడ్డికి అవకాశం
తితిదే పాలకమండలిపై ప్రభుత్వం ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 24 మంది సభ్యులతో బుధవారమే పాలకమండలిని నియమించగా, తాజాగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. వీరిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితోపాటు వివిధ నగరాల్లో స్థానిక సలహా మండలి (ఎల్‌ఏసీ) అధ్యక్షులకు చోటు కల్పించారు. రాజ్యసభ సభ్యుడు, దిల్లీ ఎల్‌ఏసీ అధ్యక్షుడు రాకేశ్‌ సిన్హా, కుపేందర్‌రెడ్డి (బెంగళూరు), గోవింద హరి (హైదరాబాద్‌), దుశ్యంత్‌కుమార్‌ దాస్‌ (భువనేశ్వర్‌), అమోల్‌ కాలే (ముంబయి)తోపాటు చెన్నైకి చెందిన శేఖర్‌ ఏజే (శేఖర్‌రెడ్డి)లను నియమించారు. వీరు ప్రత్యేక ఆహ్వానితులుగా మాత్రమే ఉంటారని, బోర్డులో తీర్మానాల ఆమోదానికి జరిగే ఓటింగ్‌లో పాల్గొనే అర్హత ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చెన్నైకి చెందిన శేఖర్‌రెడ్డి గత పర్యాయమూ తితిదే పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు. 2016  డిసెంబరు 8న ఆయన వ్యాపారసంస్థలు, ఇంట్లో ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.33.89 కోట్ల కొత్త 2వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేయడంతో డిసెంబరు 11న తితిదే పాలకమండలి నుంచి శేఖర్‌రెడ్డిని తొలగించారు. విచారణలో ఆ సొమ్మంతా శేఖర్‌రెడ్డి, అతని భాగస్వాముల వ్యాపారాలదని తేలడంతో కేసులు కొట్టేశారు. ఈ నేపథ్యంలో తితిదే పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితునిగా అవకాశం కల్పించారు.


23న నూతన ధర్మకర్తల మండలి సమావేశం

ఈనాడు డిజిటల్‌, తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ఈనెల 23న నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తితిదే గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. నూతన మండలి సమావేశం నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. తితిదే అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. మండలి సభ్యులు తమ ఇష్టమైన ముహూర్తానికి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇచ్చారు. చెన్నైకు చెందిన కృష్ణమూర్తి శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనున్నారు. తుడా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆదివారం ప్రమాణం చేస్తానని తితిదేకు సమాచారం ఇచ్చారు. మిగిలినవారు సోమవారం ఉదయం 9గంటల తర్వాత శ్రీవారి సన్నిధిలో ప్రమాణం చేయనున్నారు. తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి వారిచేత ప్రమాణం చేయిస్తారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు