close

ఆంధ్రప్రదేశ్

నెదర్లాండ్స్‌తో సంప్రదింపులు

నిపుణులకు వివరాలు పంపిన మెరైన్‌ నిపుణుడు బక్షి
బోటు వెలికితీత చర్యల్లో కానరాని పురోగతి

పాపికొండలకు వెళ్తూ మునిగిపోయిన బోటును బయటకు తీసేందుకు నెదర్లాండ్స్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రమాదస్థలిలో పరిస్థితులను పరిశీలించిన మెరైన్‌ నిపుణుడు బక్షి తిరిగి ముంబయి వెళ్లి... ఆ వివరాలను నెదర్లాండ్స్‌లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయానికి పంపించారు. ప్రతికూల పరిస్థితుల్లో బోటును వెలికితీయటమెలా? అనే అంశంపై అక్కడి నిపుణుల సలహాలను కోరారు. అక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా వ్యూహాన్ని రూపొందించి.. స్థానిక అధికారులకు పంపిస్తారు. కచ్చులూరు ప్రమాదంపై దేశ, విదేశాల్లోని మెరైన్‌ నిపుణుల మధ్య చర్చ జరుగుతోందని జాతీయ విపత్తు నిర్వహణ దళం అధికారి ఒకరు ఈనాడుకు తెలిపారు. ఇంత ప్రవాహవేగం.. ఇంత లోతులో ఉన్న బోటును బయటకు తీసిన ఘటనలు ఎక్కడైనా ఉన్నాయా.. ఉంటే అక్కడ అనుసరించిన వ్యూహాలేంటని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


కొక్కేలు వేయటమే సవాలు?

నదిలో చిక్కుకున్న బోటుకు కొక్కేలు వేసి లాగాలి. ప్రమాదస్థలిలోని ప్రతికూల పరిస్థితుల వల్ల కొక్కేలు తగిలించడమే సవాలుగా మారింది. నౌకాదళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం డైవర్లు 60-70 అడుగులకు మించి లోపలికి వెళ్లలేని పరిస్థితి. వెళ్లినవారిని పైకిలాగడమే కష్టమవుతోందని వెలికితీత చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది వివరించారు. బోటు మునిగిన చోట పంటులతో ప్లాటుఫారం ఏర్పాటుచేసుకుని దానిపై నుంచి యాంకర్లు వేద్దామంటే... సుడిగుండాల వల్ల పంటులను నిలపలేకపోతున్నారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా యంత్రాలేవైనా బోటును తీసేందుకు ఉపయోగపడతాయా అనీ పరిశీలిస్తున్నారు. బోటు వెలికితీతలో గురువారమూ ఎలాంటి పురోగతి లేదు. బోటు మునిగిన ప్రాంతంలో ఉదయం 11 గంటలకు భారీవర్షం.. మధ్యాహ్నానికి విపరీతంగా ఎండ ఉన్నాయి. వెలికితీత చర్యలకు ఇలాంటి పరిస్థితులూ అవరోధంగా మారుతున్నాయి.

- కచ్చులూరు నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు