close

తెలంగాణ

ప్రైవేటు బడుల్లో రుసుముల నియంత్రణేదీ!

ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకాల్లో జాప్యం
కాంగ్రెస్‌ శాసనసభ్యుడు శ్రీధర్‌బాబు విమర్శలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు శ్రీధర్‌బాబు విమర్శించారు. గతంలో తీసుకొచ్చిన నియంత్రణ చట్టం ఎంతమేరకు అమలవుతుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ పాఠశాలల్లో అత్యధికంగా రుసుములు గుంజుతున్న విషయం శాసనసభ్యులందరికీ తెలుసనీ, అమలు చేయాల్సిన అధికారుల్లో మాత్రం అది కనిపించడం లేదన్నారు. శాసనసభలో విద్యా, వైద్య పద్దులపై జరిగిన చర్చలో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘పాఠశాల విద్య విషయంలో ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని ప్రభుత్వం కల్పించలేదనే బాధ కలుగుతోంది. ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారం రుసుములు వసూలు చేస్తున్నా అడ్డుకట్ట వేయలేకపోతోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో విద్యాహక్కు చట్టాన్ని తీసుకొచ్చినా రాష్ట్రంలో అమలు చేయడంలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా నియామకాలు చేపట్టలేదు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ 5679 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులనూ నియమించలేకపోయారు. ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా.. బాధ్యులపై చర్యలు తీసుకోలేదు’’ అంటూ ధ్వజమెత్తారు. విషజ్వరాల రోగులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని కోరారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఇష్టానుసారం వసూలుచేస్తున్న బిల్లుల నియంత్రణకూ చట్టాన్ని తేవాలని శ్రీధర్‌బాబు కోరారు.

సర్కారు వైద్యసేవలు అద్భుతం: ఎమ్మెల్యేలు
విద్య, వైద్య పద్దులపై నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ కిట్‌ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. నిమ్స్‌లో వెంటిలేటర్లు సరిపోవడంలేదనీ, అదనంగా మరో 50 సమకూర్చాలని ఆయన కోరారు. వికారాబాద్‌ శాసనసభ్యుడు మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ వైద్యులు, నర్సులపై దాడులను నియంత్రించడానికి కఠిన చట్టాలు అమలుచేయాలని కోరారు. అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను చేస్తోందన్నారు. గ్రామీణంలో మారుమూల ప్రాంతాల్లో వైద్యులకు నివాసానికి అనుకూలంగా వసతులు కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యేలు సతీష్‌, మోజంఖాన్‌, హనుమంతు షిండే, సుమన్‌, వివేకానంద, తదితరులు మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌లో భర్తీచేయగా మిగిలిన సీట్లను స్థానికంగా కాలేజీలే నింపుకొనేలా వెసులుబాటు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో రుసుములను నియంత్రించటానికి ముందు.. రెండు కార్పొరేట్‌ కళాశాలల ఆగడాలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు