close

తెలంగాణ

గ్రానైట్‌ మాఫియాతో నలుగురు మంత్రులకు సంబంధం

అక్రమాలపై సీబీఐతో విచారణ చేయిస్తాం
కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌

వేములవాడ, న్యూస్‌టుడే: గ్రానైట్‌ మాఫియాలో నలుగురు రాష్ట్ర మంత్రుల హస్తం ఉందని  కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. వారిని జైలుకు పంపించేంతవరకు పోరాటం చేస్తామన్నారు. గ్రానైట్‌ మాఫియాపై సీబీఐతో విచారణ జరిపిస్తామని  పేర్కొన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు భాజపాలో చేరారు. అనంతరం నిర్వహించిన సభలో సంజయ్‌ మాట్లాడుతూ గత మూడేళ్లలో గ్రానైట్‌ వ్యాపారంలో 8 క్వారీల్లో రూ.749 కోట్ల అవినీతి జరిగినట్లు మైనింగ్‌ అధికారులు గుర్తించారని అన్నారు.  మొత్తం క్వారీల్లో అక్రమాలను గుర్తిస్తే రూ.పది వేల కోట్ల మేరకు అవినీతి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను నలుగురు మంత్రులకు గ్రానైట్‌ అవినీతితో సంబంధం ఉందని అంటుంటే మంత్రి గంగుల మాత్రం ఆరుగురికి సంబంధమున్నట్లుగా చెప్పుకొంటున్నారన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా కొనసాగుతోందన్నారు. సిరిసిల్ల సెస్‌లో అవినీతి చోటు చేసుకుందని, తన దగ్గర పూర్తిస్థాయిలో ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. గ్రామాల్లో భాజపా కార్యకర్తలతోపాటు తన మద్దతుదారులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతూ బెదిరిస్తుందని ఆరోపించారు. తనకు కేసులు కొత్త కాదని, పేదలకు అండగా నిలిచి రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను వెలికితీస్తామన్నారు. వేములవాడ పురపాలక సంఘంఎన్నికల్లో భాజపా గెలవకపోతే రాజన్న ఆలయంలో యాదాద్రి తరహాలో కేసీఆర్‌ చిత్రాలతోపాటు విగ్రహాలు వెలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు