close

ఆంధ్రప్రదేశ్

డిస్కంలకు కరెంట్‌ షాక్‌

బహిరంగ మార్కెట్‌లో పెరిగిన విద్యుత్‌ ధర
యూనిట్‌ రూ.5.40
గత నెలలో రూ.200 కోట్ల భారం
రాష్ట్రంలో ఉత్పత్తి తగ్గటమే కారణం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో తగ్గిన విద్యుత్‌ ఉత్పత్తి డిస్కంలకు ఆర్థిక భారంగా పరిణమించింది. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం కావటంతో వ్యవసాయ విద్యుత్తు వినియోగం పెరిగి రోజువారీ డిమాండ్‌ 190 మిలియన్‌ యూనిట్లకు చేరింది. దీంతో విద్యుత్తు డిమాండ్‌ అధిగమించటానికి విద్యుత్‌ ఎక్సేంజ్‌ల నుంచి అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా గత నెలలో రూ.200 కోట్ల విలువైన విద్యుత్తును అధిక ధరకు కొనుగోలు చేయక తప్పలేదు. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ తట్టుకోవటానికి సర్దుబాటు కోసం ‘శ్వాప్‌’ కింద నవంబరు 2018 నుంచి ఏప్రిల్‌ 2019 వరకు పంజాబ్‌, హరియాణా   దిల్లీ రాష్ట్రాల నుంచి అందుబాటులో ఉన్న అధిక విద్యుత్తును ట్రాన్స్‌కో తీసుకుంది. ఇలా తీసుకున్న విద్యుత్తును నిబంధన మేరకు ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు తిరిగి ఇవ్వాలి. ఇలా రోజుకు 1,500 మెగావాట్ల విద్యుత్తును శ్వాప్‌ కింద తిరిగి ఇవ్వాల్సి వస్తోంది. మరోపక్క రాష్ట్రంలోనూ విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో విద్యుత్తు ఉత్పత్తి తగ్గిన సమయంలో సర్దుబాటు చేయటం భారంగా మారింది.

డిమాండ్‌ను బట్టి ధర
విద్యుత్తు డిమాండ్‌ సర్దుబాటుకు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయటం వల్ల అధిక ధరల భారాన్ని మోయాల్సి వస్తోంది. మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి ధరల్లో భారీగా వ్యత్యాసం ఉంటుంది. ఈ రకంగా గరిష్ఠంగా యూనిట్‌కు రూ.4.80 వంతున వెచ్చించారు. దీనికి అదనంగా సెంట్రల్‌ ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీ ఛార్జీలు(సీటీయూ) కింద యూనిట్‌కు రూ.0.60 వంతున చెల్లించాలి. మొత్తంమీద ఒక్కో యూనిట్‌కు రూ.5.40 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఇలా గత నెల సుమారు రూ.200 కోట్ల విలువైన విద్యుత్తును ఎక్సేంజ్‌ల ద్వారా ట్రాన్స్‌కో కొనుగోలు చేసింది. ఈ భారం మొత్తం డిస్కంలపై పడనుంది.

ఉత్పత్తి ఎందుకు తగ్గింది?

* బొగ్గు కొరత, మరికొన్ని ఇతర కారణాలతో రాష్ట్రంలో స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుత్‌ ఉత్పత్తి సాగడంలేదు.
* వాతావరణ ప్రతికూల పరిస్థితులతో పవన, సౌర విద్యుత్తూ ఆశించిన స్థాయిలో లేదు


.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు