close

ఆంధ్రప్రదేశ్

రండి.. నిద్రపోండి!

న్యూయార్క్‌ వాసుల కొత్త ఉపాయం
నిద్ర కోసం ప్రత్యేకంగా అద్దెకు క్యాబిన్లు

ఇంట్లో సమస్యలు, నిత్యజీవితంలో సవాళ్లు. వాటివల్ల కంటిమీద కునుకురాదు. కార్యాలయాలకు వెళ్లడానికి సుదీర్ఘ ప్రయాణాలు, ఉద్యోగాల్లో ఒత్తిడి, పోటీ పెరిగిపోవడం, వీటన్నింటికీ తోడు అర్ధరాత్రి వరకు పార్టీలు లేదా చరవాణిలో చాటింగులు. ఫలితంగా పగలు కార్యాలయానికి వెళ్లిన గంటకే నిద్ర ముంచుకొస్తుంది. అలాంటప్పుడు ఓ 20-30 నిమిషాలు కునుకేస్తే హాయిగా అనిపిస్తుంది. న్యూయార్క్‌వాసులు ఇలా కార్యాలయ సమయాల్లో నిద్రపోతున్నారు. అందుకోసం వాళ్లు డబ్బులిచ్చి క్యాబిన్లను అద్దెకు తీసుకుంటున్నారు. వీటిలో మెత్తటి పరుపులు, తలగడలు ఉంటాయి. పరుపు కావల్సిన కోణంలో పెట్టుకోడానికి మీటలుంటాయి. పైకి చూస్తే నక్షత్రాలు కనపడేలా డిజైన్‌ ఉంటుంది. ఇలా నిద్రపోవడానికి నీడకల్పించే సంస్థల్లో ‘నాప్‌యార్క్‌’ ఒకటి. అక్కడి క్యాబిన్లలో అరగంట నిద్రపోవాలంటే 15 డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.1075) చెల్లించాలి. నెలకు 250 డాలర్లు (రూ.18వేలు). ఇలాంటి రకరకాల ప్యాకేజీలున్నాయి.

విమానాల్లో ప్రయాణించి వచ్చేవాళ్లు తమ కేంద్రానికి ఎక్కువగా వస్తున్నారని నాప్‌యార్క్‌ కమ్యూనిటీ డైరెక్టర్‌ రెజా మోరెనో తెలిపారు. మధ్యాహ్నభోజనం తర్వాత నిద్రపోవడానికి, లేదా ఏదైనా అత్యవసర సమావేశానికి ముందు స్నానం చేయడానికి ఉద్యోగులు ఇక్కడకు వస్తారు. అమెరికన్లలో చాలామందికి నిద్ర చాలట్లేదు. యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అంచనా ప్రకారం మూడోవంతుమంది అమెరికన్లు తమకు అవసరమైనదాని కంటే తక్కువ నిద్రపోతున్నారు. 24% మందికే రోజుకు 8గంటలు.. అంతకంటే ఎక్కువ నిద్ర దొరుకుతోంది. సగం మందికిపైగా ఆరుగంటలు లేదా అంతకంటే తక్కువసేపే నిద్రపోతున్నారు. నిద్రలేమి వల్ల అమెరికా ఆర్థికవ్యవస్థకు 41,100 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతోంది.

-ఈనాడు, ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు