close

ఆంధ్రప్రదేశ్

మిగతా మృతదేహాలు ఎక్కడో?

గాలింపుచర్యల్లో కానరాని పురోగతి
అవంతి ఫోన్‌తోనే కదిలిన బోటు: హర్షకుమార్‌
మాజీ ఎంపీ వ్యాఖ్యలను ఖండించిన ఎస్పీ

ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే యంత్రాంగం: బోటు ప్రమాదంలో గల్లంతైనవారిలో బుధవారానికి 34 మంది మృతదేహాలు వెలికితీయగా మిగిలినవారి ఆచూకీ లభ్యంకాలేదు. గురువారం గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. గల్లంతైన వారి ఆచూకీ లభ్యంకాక బంధువులు ఆందోళన చెందుతున్నారు. మృతదేహాలు సముద్రంలోకి కొట్టుకెళ్లాయా.. మునిగిపోయిన బోటులోనే ఉన్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బోటును బయటకు తీసే అంశంపై ముంబయి బృందం నివేదిక ఇచ్చాకే ముందుకెళ్తామని, అప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేమని తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ లక్షీశ స్పష్టంచేశారు.

ఆచూకీ లభించని వారెందరో..?
గల్లంతైన వారిలో 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. పోలీసుల వద్ద ఉన్న జాబితాలో 18 పేర్లున్నాయి. విశాఖపట్నానికి చెందిన అయిదుగురు.. హైదరాబాద్‌, వరంగల్‌కు చెందిన ముగ్గురు.. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు.. నంద్యాల, నల్గొండ, మంచిర్యాలకు చెందిన ఒక్కొక్కరి చొప్పున ఆచూకీ తెలియాలి.

ఆ మృతదేహం మా మేనల్లుడిదే..
ప్రభుత్వాసుపత్రి వద్ద ఓ మృతదేహాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారని, అది తమవారిదైతే పరిస్థితి ఏంటంటూ ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా.. అది ఆయన బంధువుదే అని తేలింది. పడవ ప్రమాదానికి సంబంధించిన ఓ మృతదేహాన్ని మూడు రోజుల క్రితం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. దానిని ఎవరూ గుర్తించలేకపోయారు. హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌ ఆసుపత్రి వద్దే ఎదురుచూస్తున్నారు. అక్కడే ఉంచిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించి.. దానిని ఫ్రీజర్‌లో భద్రపర్చాలని కోరారు. దీనిపై కలెక్టర్‌కూ ఫిర్యాదుచేశారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించారు. అదేరోజు సాయంత్రం రాజేంద్రప్రసాద్‌ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ.. ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేశారు. చివరకు టీషర్టును బట్టి.. మృతుడిని తన మేనల్లుడు గోకుల్‌సుశీల్‌గా గుర్తించారు. ఆ మృతదేహాన్ని తీసుకుని హైదరాబాద్‌ పయనమయ్యారు.

అనుచిత వ్యాఖ్యలు తగవు: ఎస్పీ
బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఫోన్‌ చేశారనడం వాస్తవం కాదన్నారు. ఇటువంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో అనుమానాలు, ఆయోమయానికి గురిచేస్తాయన్నారు. ఇలాంటి దురదృష్టకర సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎస్పీ పేర్కొన్నారు.

యాత్ర వద్దని ఎస్సై చెప్పినా..
వరద ఉద్ధృతి వల్ల ప్రమాదం పొంచి ఉందని.. అంతా వెనక్కి వెళ్లిపోవాలని దేవీపట్నం ఎస్సై చెప్పినా వినిపించుకోకపోవడమే ప్రమాదానికి కారణమైందా? తప్పనిసరిగా స్టేషన్‌ వద్ద బోటు ఆపాల్సి ఉన్నా.. ఆపకపోవడంతో ఎస్సై వెళ్లి దాన్ని తీసుకొచ్చారా? బోటును ఆపినప్పుడు ఎస్సైకి, బోటు సరంగులకు మధ్య 40 నిమిషాల పాటు సంభాషణ జరిగిందని విశ్వసనీయ సమాచారం. బోటును పాపికొండలకు తీసుకెళ్లొద్దని ఎస్సై చెబుతున్నా.. అనుమతులున్నాయని బోటు బాధ్యులు బదులిచ్చారు. బోటును అక్కడ ఆపినప్పుడు పోలీసులకు బయట నుంచి ఫోన్లు వచ్చినట్లు సమాచారం. ఎస్సైతో పాటు సిబ్బంది బోటు పైభాగంలో తనిఖీలు చేసేటప్పుడు ఎవరూ లైఫ్‌జాకెట్లు ధరించలేదు. వారందరితో లైఫ్‌జాకెట్లు వేయించారు. 45 నిమిషాల తర్వాత బోటు బయల్దేరింది. పోలీస్‌స్టేషన్‌ దాటాక కొందరు లైఫ్‌జాకెట్లు తీసేశారు. వాటిని ఉంచుకున్నవారే సురక్షితంగా బయటపడ్డారని ఓ ప్రయాణికుడు చెప్పారు.

మంత్రి ఫోన్‌ వల్లే: హర్షకుమార్‌

పాపికొండలకు బోటు ప్రయాణం వద్దని ఆదివారం దేవీపట్నం ఎస్‌ఐ వారించినా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఫోన్‌ చేయడం వల్లే బోటు ముందుకు కదిలిందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ఆరోపించారు. బోటులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. బోట్ల నిర్వహణలో నాయకులు, పర్యాటక శాఖ అధికారులు పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు.

పడవ ప్రమాదంపై విచారణ కమిటీ

ఈనాడు, అమరావతి: కచ్చులూరు పడవ ప్రమాదంపై విచారణకు ఆరుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విచారణను 21 రోజుల్లో పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి, శాంతిభద్రతల అదనపు డైరెక్టర్‌ జనరల్‌, పోర్టు డైరెక్టర్‌ సభ్యులుగా ఉంటారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ సమన్వయకర్త.

కమిటీ విచారించాల్సిన అంశాలివీ..
* ప్రమాదానికి కారణం ఎవరు?
* భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
* లైసెన్సులు లేని, వినియోగానికి పనికిరాని పడవల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు.
* పడవలు బయల్దేరేచోట కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుపై సలహా.
* వరద సమయంలో, దానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి అమలుకు ఎలాంటి విధానాన్ని అమలుచేయాలి.

మృతదేహాలకు జన్యుపరీక్ష

ఈనాడు, అమరావతి: ఇకపై వివాదాలకు తావులేకుండా జన్యు పరీక్షల ద్వారా మృత దేహాలను గుర్తించనున్నారు. పాపికొండల్లో జరిగిన బోటు ప్రమాదంలో బుధవారం సాయంత్రం బయటపడిన ఓ యువకుడి శవాన్ని గుర్తించడంలో అతడి టీషర్టు ఉపయోగపడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతడి వివరాలను జన్యుపరంగానూ గుర్తించే ప్రయత్నాలు జరిగాయి. మరోవైపు ప్రమాదం జరిగి గురువారానికి 5 రోజులైంది. దీంతో ఇకపై దొరికే మృతదేహాలు పాడైపోతాయని, వాటి గుర్తింపు సాధారణంగా సాధ్యం కాకపోవచ్చని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ రమేశ్‌కుమార్‌ చెప్పారు. జన్యు (డీఎన్‌ఏ) పరీక్షల కోసం మృతదేహాల పొడవాటి తుంటి ఎముక, పక్కటెముకలను తీసి భద్రపరచనున్నట్లు సీనియరు వైద్యుడు సునీల్‌రాజ్‌ తెలిపారు. వీటిని తల్లిదండ్రుల జన్యుకణాలతో పోల్చి.. గుర్తించాల్సి ఉంటుందని వివరించారు. ఇందుకు సమయం పడుతుందన్నారు.


 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు