close

ఆంధ్రప్రదేశ్

మీరా నీతులు చెప్పేది?

వైఎస్‌ కబ్జాలు చేయలేదా?
ఆయన చనిపోయాక మీరు ప్రభుత్వ బంగ్లాలో ఎన్ని రోజులున్నారు?
ఫర్నిచర్‌ ఎన్ని రోజులు వాడుకున్నారు? అదేమైనా మీ తాత సొమ్మా?
సీఎం జగన్‌పై చంద్రబాబు ధ్వజం
గవర్నర్‌ను కలిసి 13 పేజీల ఫిర్యాదు అందజేత
ఈనాడు - అమరావతి

కోడెల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని (సెక్షన్‌ 409), దొంగ సొత్తు కలిగి ఉన్నారని (సెక్షన్‌ 411) ఆయనపై కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేశారు. రూ.లక్ష విలువ చేసే ఫర్నిచర్‌ కోసం ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించారు. ఆయన కుటుంబంపై గత 3 నెలల్లో 18 చిల్లర కేసులు పెట్టారు. కోడెల లేఖ రాసినా స్పందించని అసెంబ్లీ కార్యదర్శిని శిక్షించాలి. ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి.

పోలీసులు పోస్టింగ్‌ల కోసం కక్కుర్తిపడి అధికార పార్టీ నాయకులు ఏం చెబితే అది చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ అరాచకాలపై కేంద్ర హోం మంత్రికి, కేంద్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.

- తెదేపా అధినేత చంద్రబాబు

‘‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయాక ప్రభుత్వ అధికారిక బంగ్లాలో మీరు ఎన్ని రోజులున్నారు? ప్రభుత్వ ఫర్నిచర్‌ను ఎన్ని రోజులు వాడుకున్నారు? అదేమైనా మీ తాత సొమ్మా? అది దొంగ సొత్తు కాదా?’’ అని ముఖ్యమంత్రి జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇడుపులపాయలోనూ, హైదరాబాద్‌లోనూ భూములు కబ్జా చేసిన వైఎస్‌ కుటుంబం నుంచి వచ్చిన మీరు నీతులు చెబుతున్నారా అని నిలదీశారు. శాసనసభాపతి, మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌లకు ఇచ్చిన ఫర్నిచర్‌ను వారి పదవీకాలం ముగిశాక వెనక్కు తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చంద్రబాబు అన్నారు. మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తన దగ్గరున్న ఫర్నిచర్‌ తీసుకెళ్లమని పలుమార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పార్టీ నేతల్ని వెంట తీసుకుని చంద్రబాబు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌  బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతోందని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్‌కు 13 పేజీల ఫిర్యాదుతోపాటు కోడెలపై సాక్షిలో వచ్చిన కథనాలను, వైకాపా ఎంపీ విజసాయిరెడ్డి చేసిన ట్వీట్లను, వారి కుటుంబంపై పెట్టిన కేసుల వివరాల్ని అందజేశారు. అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు.

మీ చరిత్ర ఎవరికి తెలియదు?
‘‘ప్రభుత్వం పేదలకు ఇచ్చిన 618 ఎకరాల అసైన్డ్‌ భూముల్ని ఇడుపులపాయలో వైఎస్‌ కుటుంబం కబ్జా చేసింది. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా మేం అది బయటపెట్టాం. తన తండ్రికి తెలియక ఆ భూములు కొన్నారని, తిరిగిచ్చేస్తామని వైఎస్‌ చెప్పారు. కొంత భూమి ట్రిపుల్‌ ఐటీకి ఇచ్చి, మిగతా భూమికి విలువ పెంచుకున్నారు. జూబ్లీహిల్స్‌లో వైఎస్‌ ఆక్రమించిన స్థలాన్ని క్రమబద్ధీకరించాలని కోరితే.. నేను సీఎంగా ఉండగా తిరస్కరించాను. ఆయన సీఎం అయ్యాక క్రమబద్ధీకరించుకున్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి మీరు నీతులు చెబుతున్నారా?’’ అని జగన్‌పై చంద్రబాబు మండిపడ్డారు.

మీ మామ గంగిరెడ్డిని విచారించరేం?
కోడెల చనిపోయే సమయానికి ఆయన కుమారుడు శివరాం కెన్యాలో ఉంటే.. అతను కొట్టడం వల్లే కోడెల చనిపోయారని సాక్షి టీవీలో దుష్ప్రచారం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘జగన్‌ చిన్నాన్న వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని తొలుత సాక్షిలో ప్రసారం చేశారు. తర్వాత గంటన్నరపాటు ఆత్మహత్య అన్నారు. ఆ తర్వాత హత్యని తేలింది. ప్రస్తుత ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి.. వివేకా ఇంట్లో రక్తపు మరకలను తుడిచేశారు. ఆయన మృతదేహాన్ని పడకగది నుంచి బాత్‌రూమ్‌లోకి తెచ్చారు. జగన్‌ మామ గంగిరెడ్డి ఆస్పత్రిలోనే వివేకానందరెడ్డి భౌతికకాయానికి బ్యాండేజీ కట్టారు. ఈ కేసులో అవినాష్‌రెడ్డిని, ఆయన తండ్రిని, గంగిరెడ్డిని పోలీసులు ఒక్కసారైనా ప్రశ్నించారా?’’ అని నిలదీశారు.

తప్పుడు ఆరోపణలు చేస్తారా?
కోడెలను తాను పట్టించుకోలేదని వైకాపా నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆయనకు అన్ని విధాలా మద్దతుగా నిలిచానన్నారు. కోడెల పార్టీ కార్యాలయానికి వచ్చి తనతో పలుసార్లు మాట్లాడారని తెలిపారు. అక్రమ కేసులు పెట్టినందుకు కోడెల తనలో తాను చాలా బాధపడ్డారుగానీ, తమతో అంత లోతుగా ఆ విషయాలేమీ పంచుకోలేదన్నారు. ‘‘వైకాపా నాయకులు అప్పట్లో నేను
కోడెలపై చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు పలకరించలేదంటున్నారు. రేపు వారసుల్ని ప్రకటించలేదంటారు’’ అని విమర్శించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు