close

ఆంధ్రప్రదేశ్

ఇన్ని ఉద్యోగాల కల్పన చరిత్రలో తొలిసారి

ఎన్నికల హామీలో చెప్పినట్లే చేశాం
నిష్పక్షపాతంగా పరీక్షల నిర్వహణ
ఎంపికైన అభ్యర్థులు ప్రజాసేవలో మమేకం కావాలి: సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘ఒకే ప్రకటనతో 1,26,728 శాశ్వత ఉద్యోగాలు కల్పించడం చరిత్రలోనే తొలిసారి. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా పెద్ద మొత్తంలో ఉద్యోగాలిచ్చాం. ఇదో రికార్డు’ అని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలను   పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణతో కలిసి ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజేతలకు, రికార్డు సమయంలో యజ్ఞాన్ని పూర్తిచేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ఎంపికైన వారంతా శిక్షణ తీసుకొని ప్రజాసేవలో మమేకం కావాలని సూచించారు. అవినీతికి దూరంగా, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించి అధికారులు మంచి పనితీరును కనపరిచారని కితాబిచ్చారు. అక్టోబరు 2 నుంచి మొదలయ్యే గ్రామ సచివాలయాలతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులొచ్చి, ప్రజల ముంగిటకే పథకాలొస్తాయని వివరించారు. పరీక్షలు నిర్వహించిన తీరు, ఫలితాల విడుదలకు చేసిన కసరత్తు తదితర విషయాలను పంచాయతీరాజ్‌శాఖ, పురపాలక ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, జె.శ్యామలరావు... కమిషనర్‌లు గిరిజాశంకర్‌, విజయకుమార్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ఫలితాల సీడీలను సీఎం విడుదల చేశారు.

రాష్ట్రానికే గర్వకారణం: మంత్రులు
ఈనాడు డిజిటల్‌, అమరావతి: చిన్న పొరపాటుకైనా తావు లేకుండా ఒకే నోటిఫికేషన్‌ ద్వారా 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయడం దేశచరిత్రలోనే మొదటిసారని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ముఖ్యమంత్రి జగన్‌ మానస పుత్రిక అన్నారు. ఇంటి వద్దకే పరిపాలనను తీసుకువచ్చేందుకు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఇది పురుడు పోసుకుందని చెప్పారు. నవరత్నాలు, ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు