close

ఆంధ్రప్రదేశ్

ప్రాణాలు పడవల్లో పెట్టుకొని!

ప్రమాదమని తెలిసినా తప్పని ప్రయాణాలు
అలసత్వం వీడని అధికార గణం
నీటిలో బుడగల్లా అమాయక జనం

అంతా సవ్యంగా ఉంటే... గలగలలు. పరిస్థితి తలకిందులైతే మృత్యు గర్జనలు... ఇదీ నీటి ప్రవాహాల తీరు. ఆహ్లాదం కోసం కొన్నిచోట్ల... అవసరం కొద్దీ చాలాచోట్ల నదులు, ఏరులు, వాగులు, వంకల్లో పడవ ప్రయాణాలు సాగుతున్నాయి. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్లేదాకా గుండెలు అదురుతూ...ప్రాణాలు రెపరెపలాడుతూ ఉంటాయి. రాష్ట్రంలో చాలా చోట్ల సరైన మార్గాలు, వంతెనలు లేక పడవ ప్రయాణాలే దిక్కవుతున్నాయి. ఈ ప్రమాదకర పరిస్థితిని మార్చాల్సిన అధికారులేమో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

గోదావరి ప్రమాదం జరిగినా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అప్రమత్తత ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించడం లేదు. పరిధికి మించి పడవల్లో ఎక్కిస్తున్నా కిమ్మనకుండా కూర్చుండిపోతున్నారు. వాతావరణ పరిస్థితులపైనా, నది ప్రవాహ ఉద్ధృతిపైనా సరైన అవగాహన లేకుండా దాటేందుకు వెనకాడటం లేదు. విశాఖ జిల్లాలోని మారుమూల ప్రాంత గిరిజనులకు ప్రయాణం నిత్యం సాహసోపేతమే. రెక్కాడితే డొక్కాడని కొందరికి పిల్లలను చదివించుకోవాలంటే పడవల్లోనే బడికి పంపాల్సిన దుస్థితులు ఉన్నాయి. ప్రయాణ సమయాల్లో లైవ్‌జాకెట్లను ధరించడంలో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇన్ని దురవస్థల కారణంగానే ప్రమాదాలు జరిగిన సమయాల్లో ప్రాణాలు గాలిలో దీపాల్లా మారిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కనిపించిన ప్రమాద భరిత దృశ్యాలు ఇవీ.

వాన నీటిలో.. వాగు బాటలో


పడవ ఊగిందా... గుండె ఆగినట్లే!

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం గోగుల్లంక, పశువుల్లంక, జి.మూలపొలం, కుండలేశ్వరం, పల్లంకుర్రు, కొత్తల్లంక రేవుల్లో పడవల్లో రాకపోకలు సాగుతున్నాయి. పశువుల్లంక మొండిరేవులో గత ఏడాది జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ఇక్కడ వంతెన నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టి పూర్తి చేశారు. మిగతా రేవుల్లో ఇలా పడవ ప్రయాణమే శరణ్యం.


పాట్లు దాటితేనే పాఠాలు..


శ్రీహరి కోటలో..  నిత్య ‘జలయాన్‌’!

చంద్రుడి మీదకు రాకెట్లను ప్రయోగిస్తోంది శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం. ఆ కేంద్రం పరిసరాల్లోనే భావిపౌరుల భవిష్యత్తు అంధకారంలా కనిపిస్తోంది. కేవలం 16 (రానుపోను) కిలోమీటర్ల ప్రయాణానికి విద్యార్థులు అష్టకష్టాలు పడుతుండటం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పులికాట్‌ సరస్సును దాటుకుంటూ వెళ్లి వస్తుండటం చూస్తే గుండె పిండేస్తోంది. చివరికి తమిళనాడు ప్రభుత్వం పెద్దమనసుతో ఇచ్చిన లైఫ్‌జాకెట్లు చిరిగిపోగా వాటికి కుట్లేసుకుని  పిల్లలు విద్యార్జనకు వెళుతున్నారు. ఏళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నా మన ప్రభుత్వం కనీస రక్షణ చర్యలు చేపట్టలేదు. శ్రీహరికోటకు కూతవేటు దూరంలో ఉన్న తడ మండలం ఇరకం దీవి విద్యార్థుల దుస్థితి ఇది. ఇక్కడ రెండు తెలుగు మాధ్యమ ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఉపాధ్యాయులు పనిచేసేందుకు విముఖత చూపడంతో ఏళ్లుగా మూతపడ్డాయి. మత్స్యకారుల మాతృభాష తమిళం కావడంతో తమిళ మాధ్యమంలో బోధన చేయాలని కోరినా ఫలితం కరవైంది. చేసేది లేక ఈ గ్రామాల విద్యార్థులు సమీప సున్నాంబుగోళంలోని తమిళ మాధ్యమ పాఠశాలకు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పడవలో వెళుతుంటారు.

 

- ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు