close

ఆంధ్రప్రదేశ్

అర్హులు 1.98 లక్షలు

సచివాలయ పరీక్షల ఫలితాల విడుదల
రేపటి నుంచి ధ్రువీకరణ పత్రాల నమోదు
ఈనాడు - అమరావతి

గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. 1,26,728 శాశ్వత ఉద్యోగాల కోసం ఈ నెల 1 నుంచి 8 వరకు నిర్వహించిన 14 పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 19.50 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 1,98,164 మంది ఉత్తీర్ణులయ్యారు. అన్ని కేటగిరీల్లో కలిపి సగటున 10.15 శాతం మంది అర్హత సాధించారు. జిల్లాల వారీగా రోస్టర్‌ పాయింట్స్‌ ఆధారంగా నియామకాలు జరపనున్నారు. కొన్ని విభాగాల్లో పోస్టుల కంటే అర్హులు తక్కువగా ఉన్నారు. ఓపెన్‌ కేటగిరీ వారికి 40%, బీసీలకు 35%, ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులకు 30 శాతాన్ని కనీస ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించారు. ఫలితాల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి..బీ అత్యధికంగా కేటగిరీ-1   పోస్టులకు 11.63 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇందులో 87,280 మంది (7.49%) అర్హత సాధించారు.

* ఏఎన్‌ఎం/వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులకు 46.36 శాతం మంది అర్హత పొందారు.
* పశు సంవర్థక సహాయకుల పోస్టులకు 38.56 శాతం మంది అర్హత సాధించారు.
* ఇతర విభాగాల్లో కేటగిరీ-2 గ్రూప్‌-ఎ పోస్టులకు 18.2 శాతం, కేటగిరీ-2 గ్రూప్‌-బి పోస్టులకు 19.3 శాతం, గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులకు 27.57 శాతం, గ్రామ మత్స్య సహాయకులకు 13.24 శాతం, వార్డు ప్రణాళిక, రెగ్యులేషన్‌ కార్యదర్శి పోస్టుకు 16.57 శాతం, వార్డు విద్య, డాటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి పోస్టుకు 13.62 శాతం, గ్రామ పట్టు పరిశ్రమ సహాయకులు పోస్టుకు 15.9 శాతం మంది అర్హత పొందారు.

ఓసీల్లో 6.2 శాతమే అర్హత
కేటగిరీల వారీగా పరిశీలిస్తే ఈ పరీక్షల్లో ఓసీల్లో అతి తక్కువ మంది అర్హత సాధించారు. 3.95 లక్షల మంది ఓపెన్‌ కేటగిరీ (ఓసీ) అభ్యర్థులు పరీక్షలు రాస్తే, 24,583 మంది (6.2 శాతం) అర్హులయ్యారు.
* అత్యధిక సంఖ్యలో 10.04 లక్షల మంది   బీసీలు హాజరైతే, 1,00,494 మంది (10 శాతం) అర్హులయ్యారు.
* ఎస్టీల్లో 9.6 శాతం, ఎస్సీల్లో 14.06 శాతం అర్హత పొందారు.
* అర్హత సాధించిన మొత్తం అభ్యర్థుల్లో మహిళలు 66,835 (33.72 శాతం), పురుషులు 1,31,327 (66.27 శాతం) మంది ఉన్నారు.

ప్రతిభావంతులు వీరే
కేటగిరీల వారీగా ప్రతిభావంతుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి పరీక్షను 150 మార్కులకు నిర్వహించారు. దీనిలో కర్నూలు జిల్లాకు చెందిన ఉపేంద్రం సాయికుమార్‌రాజు (గ్రామ రెవెన్యూ అధికారి/సర్వే సహాయకుడు పరీక్ష) 122.50 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.
* ఒకే అభ్యర్ధి ఒకటికి మించిన ఉద్యోగాలకు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. విశాఖపట్నానికి చెందిన సవ్వన గోపీకృష్ణ గ్రామ రెవెన్యూ అధికారి/సర్వే అసిస్టెంట్‌ విభాగంలో మూడో స్థానంలో నిలవగా.. వార్డు ప్రణాళిక/క్రమబద్ధీకరణ కార్యదర్శి విభాగంలో రెండో స్థానం దక్కించుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన దొడ్డా వెంకటరామిరెడ్డి వార్డు పారిశుద్ధ్య/పర్యావరణ కార్యదర్శి ఉద్యోగ పరీక్షలో తొలిస్థానంలో, పంచాయతీ కార్యదర్శి పరీక్షల్లో మూడోస్థానంలో నిలిచారు.

రేపటి నుంచి ధ్రువీకరణ పత్రాల నమోదు
పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారు శనివారం నుంచి సంబంధిత  వెబ్‌సైట్లలో తమ నివాస, కుల, విద్యార్హత సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలి.
* వీరందరికీ 21, 22 తేదీల్లో కాల్‌ లెటర్లు పంపిస్తారు.
* 23 నుంచి 25 మధ్య ధ్రువపత్రాల పరిశీలన పూర్తవుతుంది.
* ఆ తర్వాత జిల్లాల వారీగా రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా 27న నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.
* అక్టోబరు 1, 2 తేదీల్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు.
* మొదటి విడతగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి.

56 రోజుల్లో పరీక్షలు...ఫలితాలు
సచివాలయ ఉద్యోగాల కోసం జులై 26న ప్రకటన జారీ చేసిన యంత్రాంగం అంతే వేగంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాల నియామకం కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో అనేక నెలల సమయం తీసుకునే పరిస్థితిఉంటే కేవలం 56రోజుల వ్యవధిలో పూర్తి చేశారు.

 

 

ర్యాంకు వస్తుందని ఉహించలేదు: అనితమ్మ

బుక్కపట్నం: రాష్ట్రస్థాయిలో కేటగిరీ-1లో ప్రథమ ర్యాంకు సాధించా. మాది అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం గశికవారిపల్లి. డిగ్రీ వరకు ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో రెండేళ్లుగా కష్టపడ్డా. పంచాయతీ కార్యదర్శి పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయా. నాటి నుంచి మరింత కష్టపడ్డా. నిత్యం దినపత్రికలు చదవడం, స్నేహితులతో కలిసి బృంద చర్చలు సాగించడం ప్రథమ ర్యాంకుకు దోహదపడ్డాయి. తప్పనిసరిగా కొలువు సాధిస్తాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ప్రథమ ర్యాంకు వస్తుందని ఊహించలేదు.

కౌలురైతు కుమారుడికి ప్రథమ ర్యాంకు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని పెసరపాడుకు చెందిన సంపతిరావు దిలీపు రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. కేటగిరీ-2 గ్రూప్‌-ఏలో 150 మార్కులకు 120.50 పొందారు. దిలీప్‌ తల్లిదండ్రులు కూర్మయ్య, ఈశ్వరమ్మ కౌలురైతులు.

ఒకటి కాదు ఒకేసారి రెండు

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: గ్రామ సచివాలయ పరీక్షల్లో ప్రకాశం జిల్లా మార్కాపురం వాసి దొడ్డా వెంకటరామిరెడ్డి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. గ్రేడ్‌-3 విభాగం వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ పరీక్షలో 105 (150కి) మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం, గ్రేడ్‌-5 పంచాయతీ సెక్రటరీ విభాగంలో 111.25 (150కి) మార్కులతో మూడో స్థానం సాధించారు. ఈయన ఏకంగా నాలుగు పీజీలు చేయడం విశేషం. కర్నూలు జిల్లా సున్నిపెంటలోని ప్రతిభా కళాశాలలో అవుట్‌సోర్సింగ్‌ అధ్యాపకుడిగా పని చేస్తున్నారు.

అవుకు యువకుడి ప్రతిభ

అవుకు, న్యూస్‌టుడే: గ్రామ సచివాలయ పరీక్షల్లో కర్నూలు జిల్లా అవుకుకు చెందిన ఉపేంద్రం సాయికుమార్‌ రాజు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. కేటగిరీ-2లోని గ్రూప్‌ 2(బి) పరీక్షలో 150 మార్కులకు 122.5 సాధించి ప్రతిభ కనబరిచారు. సాయికుమార్‌ తండ్రి సత్యనారాయణరాజు స్థానికంగా గ్రామీణ వైద్యుడిగా పని చేస్తున్నారు. తన కుమారుడు సొంతంగా చదివి కొలువుకు ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు.

డిగ్రీ చదువుతూనే...

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి పట్టణంలోని కొత్తపేటకు చెందిన తానిగుండల వెంకటరెడ్డి, సుశీల దంపతుల కుమార్తె కల్యాణి గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటారు. పశు వైద్య సహాయ అధికారి విభాగంలో 96.25 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు, జిల్లా ప్రథమ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆల్ఫా డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతున్నారు. కల్యాణిని ఆల్ఫా ఒలింపియాడ్‌ ప్రిన్సిపల్‌ హనుమంతరావు అభినందించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు