close

తెలంగాణ

చివరి ఫోన్‌కాల్‌ తొమ్మిది సెకన్లు!

గన్‌మెన్‌తో మాట్లాడిన కోడెల
కాల్‌డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెదేపా సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో పోలీసులు సాంకేతిక అంశాల ఆధారంగా ముందుకెళ్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్‌ చేశారు. కోడెల సెల్‌ఫోన్‌ కనిపించకపోవడంతో ఆయన కాల్‌డేటాపై దృష్టి సారించారు. కోడెల ఈ నెల 16న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో దాదాపు 10-12 ఫోన్‌కాల్స్‌ మాట్లాడినట్లు గుర్తించినట్లు సమాచారం. అన్నీ దాదాపు రెండు నిమిషాలలోపు.. తెలిసినవారితోనే మాట్లాడినట్లు గుర్తించారు. చివరిగా గన్‌మెన్‌ ఆదాబ్‌కు ఫోన్‌ చేసి దాదాపు 9 సెకన్లపాటు మాట్లాడినట్లు తెలుసుకున్నారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ అయిన ఆదాబ్‌ ఐదేళ్లుగా కోడెల దగ్గర పనిచేస్తున్నారు. అతనిది గుంటూరు ప్రాంతమే. ఆదాబ్‌తో 24 నిమిషాలు మాట్లాడారన్న ప్రచారంలో వాస్తవం లేదని, కాల్‌డేటాను పూర్తిగా విశ్లేషిస్తున్నామని బంజారాహిల్స్‌ ఏసీపీ కె.ఎస్‌.రావు స్పష్టం చేశారు. మరోవైపు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 7లోని కోడెల ఇంటి వద్ద ఉన్న కాపలాదారును పోలీసులు అప్రమత్తం చేశారు. ఎవరైనా ఇంటికి వస్తే సమాచారం అందించాలన్నారు. కుటుంబ సభ్యులతోపాటు, ఇంట్లో పనిచేసేవారిని పోలీసులు మరోసారి విచారించే అవకాశం ఉంది. ఆయన ఇంట్లోని కొన్ని వస్తువులను సీజ్‌ చేసిన పోలీసులు వాటిని ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం పంపించారు. ఆ నివేదిక అందాల్సి ఉంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు