close

తెలంగాణ

మిగతా మృతదేహాలు ఏమయ్యాయో?

గాలింపు చర్యల్లో కానరాని పురోగతి

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం: బోటు ప్రమాదంలో గల్లంతైనవారిలో బుధవారానికి 34 మంది మృతదేహాలు వెలికితీయగా మిగిలినవారి ఆచూకీ లభ్యంకాలేదు. గురువారం గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. గల్లంతైన వారి ఆచూకీ లభ్యంకాక బంధువులు ఆందోళన చెందుతున్నారు. మృతదేహాలు సముద్రంలోకి కొట్టుకెళ్లాయా.. మునిగిపోయిన బోటులోనే ఉన్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బోటును బయటకు తీసే అంశంపై ముంబయి బృందం నివేదిక ఇచ్చాకే ముందుకెళ్తామని, అప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేమని తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ లక్షీశ స్పష్టంచేశారు.

ఆచూకీ లభించని వారెందరో..?
గల్లంతైన వారిలో 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. పోలీసుల వద్ద ఉన్న జాబితాలో 18 పేర్లున్నాయి. విశాఖపట్నానికి చెందిన అయిదుగురు.. హైదరాబాద్‌, వరంగల్‌కు చెందిన ముగ్గురు.. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు.. నంద్యాల, నల్గొండ, మంచిర్యాలకు చెందిన ఒక్కొక్కరి చొప్పున ఆచూకీ తెలియాలి.

ఆ మృతదేహం మా మేనల్లుడిదే..
ప్రభుత్వాసుపత్రి వద్ద ఓ మృతదేహాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారని, అది తమవారిదైతే పరిస్థితి ఏంటంటూ ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా.. అది ఆయన బంధువుదే అని తేలింది. పడవ ప్రమాదానికి సంబంధించిన ఓ మృతదేహాన్ని మూడు రోజుల క్రితం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. దానిని ఎవరూ గుర్తించలేకపోయారు. హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌ ఆసుపత్రి వద్దే ఎదురుచూస్తున్నారు. అక్కడే ఉంచిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించి.. దానిని ఫ్రీజర్‌లో భద్రపర్చాలని కోరారు. దీనిపై కలెక్టర్‌కూ ఫిర్యాదుచేశారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించారు. అదేరోజు సాయంత్రం రాజేంద్రప్రసాద్‌ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ.. ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేశారు. చివరకు టీషర్టును బట్టి.. మృతుడిని తన మేనల్లుడు గోకుల్‌సుశీల్‌గా గుర్తించారు. ఆ మృతదేహాన్ని తీసుకుని హైదరాబాద్‌ పయనమయ్యారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు