close

తెలంగాణ

విద్యకు సర్కారు పెద్దపీట

సంక్షేమ విద్యాసంస్థలు, విదేశీ విద్య, వసతి గృహాలకు రూ.18,657 కోట్ల వ్యయం
ఈ ఖర్చు మానవ వనరుల నిర్మాణానికి పెట్టుబడే
త్వరలోనే ఉప కులపతుల నియామకాలు
ఉపాధ్యాయుల భర్తీ సైతం వేగవంతం
ఒప్పంద ఉద్యోగుల వేతనాల పెంపు
పద్దులపై విద్యాశాఖ మంత్రి సబిత సమాధానం
ఈనాడు - హైదరాబాద్‌

నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందనీ, బడ్జెట్‌లో విద్యకు పెద్దపీట వేసిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టీకరించారు. పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యలకు కేటాయించిన నిధులనే పరిగణనలోకి తీసుకోవద్దనీ, సంక్షేమ విద్యాసంస్థలు, వసతిగృహాలు, విదేశీ విద్యాపథకం వగైరాలకు ఇచ్చిన నిధులనూ లెక్కిస్తే.. మొత్తంగా విద్యాభివృద్ధికి 2019-20 బడ్జెట్‌లో రూ.18,657కోట్లను ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. విద్యపై వ్యయాన్ని మానవ వనరుల నిర్మాణానికి పెట్టుబడిగానే సర్కారు భావిస్తోందన్నారు. పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య పద్దులపై శాసనసభలో గురువారం చర్చలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. గురుకుల విద్యాలయాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ డిజిటల్‌ తరగతులను ప్రవేశపెట్టాం. డిగ్రీ కళాశాలల్లోనూ డిమాండున్న కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంచుతున్నాం. 30 పాలిటెక్నిక్‌ కళాశాలల భవనాల నిర్మాణాలకు రూ.169కోట్లు, 26 వసతిగృహాలకు రూ.66కోట్లు మంజూరయ్యాయి. నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇంజినీరింగ్‌ విద్య ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. న్యాక్‌ గుర్తింపు పొందిన కళాశాలల సంఖ్య పెరిగింది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎం హామీ ఇచ్చారు. వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అన్ని వర్సిటీల్లోనూ ఉపకులపతులను నియమించడానికి సంసిద్ధత ప్రకటించారు. 8792 ఉపాధ్యాయుల పోస్టులకు నియామక ప్రకటన జారీచేయగా, వీటిలో 2226 మంది ఎంపికయ్యారు. వీరిలోనూ 2363 మంది ఉద్యోగాల్లో చేరిపోయారు. కోర్టు కేసు కారణంగా నియామక ప్రక్రియలో జాప్యం జరిగింది. ఇటీవలే ఆ అడ్డంకీ తొలగింది. ఇక వేగంగా పని పూర్తిచేస్తాం. ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు ప్రభుత్వం ఆదేశిస్తే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్టుకెళ్లి ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయించుకుంటున్నాయి. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై కమిటీ నివేదిక ఇచ్చాక అవసరమైన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి తెలిపారు.

* గత విద్యా సంవత్సరానికి(2018-19) సంబంధించి సుమారు రెండు లక్షల మందికి ఉపకార వేతనాలు అందలేదు. కళాశాలలకు ఇచ్చే బోధనా రుసుములు(ఆర్‌టీఎఫ్‌) కాక, బ్యాంకు ఖాతాల ద్వారా ఉపకార వేతనాలు(ఎంటీఎఫ్‌) అందుకోవాల్సిన విద్యార్థులు 2,02,669 మంది ఉన్నారని శాసనసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.


‘ఇంటర్‌’ తప్పిదాల బాధ్యులపై చర్యలేవీ?
ప్రశ్నించిన కాంగ్రెస్‌ సభ్యుడు వీరయ్య

ఇంటర్‌ ఫలితాల్లో అక్రమాలు, తప్పిదాలు జరిగినా ప్రభుత్వం ఒక్కరిపైనా ఎందుకు చర్య తీసుకోలేదని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మృతిచెందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులేనని, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాల మాదిరిగానే కనీసం జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటుచేయాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే(తెరాస) సతీష్‌కుమార్‌ కోరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి(తెరాస)..ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలని కోరారు. కోదాడ ఎమ్మెల్యే బి.మల్లయ్య యాదవ్‌ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. కార్వాన్‌ ఎమ్మెల్యే మౌజంఖాన్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల సమస్యలపై మాట్లాడారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు