close

తెలంగాణ

త్వరలో పంచాయతీ ట్రైబ్యునల్‌

విధివిధానాలను వెలువరించిన రాష్ట్ర ప్రభుత్వం
కలెక్టర్‌ చర్యలపై సర్పంచులు సులువుగా అప్పీలు చేయెుచ్చు

ఈనాడు, హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ నూతన చట్టం ప్రకారం పకడ్బందీ వ్యవస్థ రూపుదాల్చుతోంది. ప్రభుత్వం పారదర్శకతకు కూడా ప్రాధాన్యమిస్తోంది. తాజాగా పంచాయతీ ట్రైబ్యునల్‌ అస్తిత్వం దిశగా అడుగులు పడ్డాయి. తప్పిదాలకు పాల్పడ్డారని సర్పంచి తదితరులపై కలెక్టర్‌ ఏవైనా చర్యలు తీసుకున్నప్పుడు.. వారు స్టే విధింపులాంటి ఉపశమనాల కోసం ఇంతకు ముందులా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి చుట్టూ తిరగనక్కరలేదు. రాష్ట్రంలో త్వరలో ఒక ట్రైబ్యునల్‌ అందుబాటులోకి రానుంది. ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొంటూ.. దాని విధివిధానాలను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ గురువారం వెలువరించింది.
* ట్రైబ్యునల్‌కు ఒక ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులు ఉంటారు. పదవీ కాలం మూడేళ్లు. అవసరమని భావిస్తే మూడేళ్లకు ముందే వారిని ప్రభుత్వం తొలగించవచ్చు. ట్రైబ్యునల్‌కు ఒక కార్యదర్శిని, తగిన సంఖ్యలో సిబ్బందిని సర్కారు నియమిస్తుంది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంటుంది. ఏదైనా కేసును సంబంధిత ప్రాంతంలో విచారించాలని ఛైర్మన్‌ భావిస్తే అక్కడికే ట్రైబ్యునల్‌ వెళ్తుంది. అప్పీలు చేయాలనుకున్న వారు తగిన ఆధారాలతో పాటు రూ.25వేలను ఫీజుగా చెల్లించాలి.
* వాదనలు వినేటప్పుడు ట్రైబ్యునల్‌లో కనీసం ఇద్దరు సభ్యులు ఉండాలి. ఇద్దరు సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు పూర్తిస్థాయి ట్రైబ్యునల్‌ భేటీ అయి.. మెజార్టీకి అనుగుణంగా తుది నిర్ణయాన్ని తీసుకోవాలి.
* పంచాయతీరాజ్‌ నూతన చట్టం ప్రకారం పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినప్పుడు, విధి నిర్వహణలో చెడు నడవడిక కనబర్చినప్పుడు; ప్రభుత్వం, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ లేదా తాను(కలెక్టర్‌) జారీ చేసే ఆదేశాలను పట్టించుకోవటంలేదని భావించినప్పుడు తగిన ముందుస్తు తాఖీదులను ఇచ్చి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులపై కలెక్టర్‌ చర్యలను తీసుకోవచ్చు. అవసరమని భావిస్తే ఆ చర్యలపై 30 రోజుల్లోగా వారు ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకోవచ్చు. ట్రైబ్యునల్‌ తీర్పుపై అప్పీలు అధికారం సర్కారుకు ఉంటుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు