close

తెలంగాణ

24న మరోసారి సీఎంల భేటీ!

పెండింగ్‌ సమస్యలపై  చర్చించనున్న  కేసీఆర్‌, జగన్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలన్నింటిని పరిష్కరించుకునే దిశగా ఈనెల 24న మరోసారి ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరగనుంది. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిని శుక్రవారం కేసీఆర్‌ అధికారికంగా వెల్లడించే వీలుంది. హైదరాబాద్‌లోనే ఈ సమావేశం జరగవచ్చని సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఇప్పటికే మూడు దఫాలు సమావేశాలు జరిగాయి. పలు అంశాలపై అంగీకారం కుదిరింది. తర్వాత మరికొన్నిసార్లు భేటీ జరగాల్సి ఉన్నా అక్కడా, ఇక్కడా శాసనసభ సమావేశాలు, ఇతరత్రా కారణాల వల్ల జరగలేదు. తొమ్మిది, పది షెడ్యూలు సంస్థల విభజన, గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం తదితర అంశాలు పెండింగులో ఉన్నాయి. గతంలోని నిర్ణయాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆర్థికపరమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. వీటిని సత్వరమే పరిష్కరించుకోవాలని భావిస్తున్న ఇద్దరు సీఎంలూ ఈ మేరకు ఫోన్‌లో చర్చించి తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కేంద్రం వైఖరిపైనా చర్చ: ఈనెల 24న జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపైనా కేసీఆర్‌, జగన్‌లు చర్చించే వీలుంది. రెండు రాష్ట్రాల్లో భాజపా ఇద్దరు సీఎంలపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. కొన్ని అంశాల్లో కేంద్రం నుంచి సరైన సహకారం లభించడం లేదనే భావన రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు