close

తెలంగాణ

కాళేశ్వరం ఫలిస్తోంది

త్వరలో రోజుకు 2 టీఎంసీల ఎత్తిపోతలు
ఎస్సారెస్పీలోకి నీటిని తోడేందుకు పంపులు సిద్ధం
కాళేశ్వరం కింద అక్టోబరులోనూ 174 టీఎంసీలు
అప్పుల్ని సద్వినియోగం చేస్తున్నాం
శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్

మొదటి ఫలితంతో అభినందనలు

కాళేశ్వరం ప్రాజెక్టు నీటి పంపిణీ విజయవంతంగా పూర్తయినచోట అద్భుత ఫలితాలు వస్తున్నాయి. కరవు ప్రాంతమైన హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని రేగొండకు నీళ్లు చేరడమే దీనికి ఉదాహరణ. మమ్మల్ని నిత్యం విమర్శించే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రాంతానికి నీళ్లు రావడంతో ఆయన ప్రభుత్వాన్ని అభినందించారని అక్కడి వారు తెలిపారు. తెచ్చిన అప్పుల్ని సద్వినియోగం చేస్తున్న విషయాన్ని ప్రతిపక్షాలు విస్మరిస్తున్నాయి. కాళేశ్వరం పథకం కింద 44 నుంచి 45 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతాయి.

-శాసనసభలో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌

 

ఈనాడు - హైదరాబాద్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలితాలు ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో పేర్కొన్నారు. గురువారం ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. రుతుపవనాలు తిరోగమనంలో ఉండే అక్టోబరులోనూ ఈ పథకం కింద 174 టీఎంసీలు, నవంబరులో 45 నుంచి 50 టీఎంసీల వరకు జలాలు అందుబాటులో ఉంటాయన్నారు. యాసంగి నాట్లు పడ్డాక కాళేశ్వరం ప్రభావం చూపుతుందని తెలిపారు. గాయత్రి, నంది పంపుహౌసుల్లో ఐదేసి బాహుబలి మోటార్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో 20 రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందన్నారు. ఒక టీఎంసీ నీటిని మధ్య, దిగువ మానేరులకు, మరో టీఎంసీ ఎస్సారెస్పీకి తరలిస్తామన్నారు. వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆయన సభలో ఏం మాట్లాడారంటే..

మానవ నిర్మిత నది ఈ కాలువ
‘‘ఎడారిలా మారిన శ్రీరామసాగర్‌ పరిస్థితిపై పరిశీలిస్తుంటే వరద కాలువ కనిపించింది. దానినే రిజర్వాయర్‌గా మార్చాం. ఆకాశం నుంచి చూస్తే గోదావరి ఒకవైపు పారుతుంటే వరద కాలువ మరోవైపు ప్రవహిస్తుంటుంది. ఆ దృశ్యం అద్భుతం. 200 కిలోమీటర్ల మేర నిత్యం నీళ్లు ఉంటాయి. ఇది పూర్తిగా మానవ నిర్మిత నది. కాలువ ద్వారా నీళ్లు పైకి ఎగబాకి ఇప్పటికే శ్రీరామసాగర్‌ను ముద్దాడాయి. ఇక్కడ రోజుకు టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు పంపులు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఎగువ నుంచి నీళ్లు వస్తుండటంతో విద్యుత్తు వృథా చేయొద్దని వేచి చూస్తున్నాం. కాలువలోని నీళ్లతో చెరువులను నింపుతున్నారు. ఎస్సారెస్పీ, గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల, ముథోల్‌, నిర్మల్‌ నియోజకవర్గాల ప్యాకేజీల కింద ఆయకట్టు ఇక వందశాతం స్థిరీకరణ అయినట్లే. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌లు సిద్ధమైతే నిజాంసాగర్‌లో నీటి నిల్వలు తరిగిపోవు. సింగూరు ఎండిపోదు. తాగునీటి సమస్య రాదు.

త్వరలో నిజామాబాద్‌ పర్యటన..
నిజామాబాద్‌ జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ 21, 22 కింద కొత్తగా 2 లక్షల ఎకరాలకు పైపులతో సాగునీటిని ఇవ్వనున్నాం. దీనికోసం త్వరలో జిల్లాలో పర్యటిస్తాను. కొత్తఆయకట్టు చేయాలంటూ ముథోల్‌, నిర్మల్‌ తాలూకాల్లోనూ డిమాండ్లు వస్తున్నాయి. తూర్పు ఆదిలాబాద్‌లోని తమ్మిడిహట్టిని చేపట్టి ఆదిలాబాద్‌, కాగజ్‌నగర్‌, చెన్నూరు నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తాం. 145 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం ఉంది. ఈ మేరకు నిర్మాణాలు చేపడతాం. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక ప్యాకేజీ కింద తీర్చిదిద్దాలి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.


పోలీసులకు వారాంతపు సెలవు యోచన

‘‘పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటారు. దీనిపై డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు హోంశాఖ కార్యదర్శితో చర్చించాం. వారాంతపు సెలవు లేదా పదిరోజులకో విశ్రాంతి దినం ఇలా ఏదైనా కావచ్చు ఒత్తిడి నుంచి బయటపడేలా ఏదో ఒక ఏర్పాటు చేయాలని వారికి సూచించా. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ట్రాఫిక్‌ పోలీసులు కూడా కాలుష్యం నడుమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది సరైంది కాదు. హోం శాఖ కార్యదర్శి, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌తో దీనిపై చర్చిస్తున్నాం. పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోంది. ఎక్కడా లేకున్నా మన రాష్ట్రంలో హోంగార్డులకు వేతనాలు ఇస్తున్నాం. వారు పదవీ విరమణ చేసే నాటికి నెలకు రూ. 50,000 వేతనం అందుతుంది. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ డిసెంబరు లేదా జనవరి నాటికి పూర్తి కావచ్చు. విపత్తుల నిర్వహణ, ఉత్పాతాలు, కరవు, వరదలు ఏర్పడినప్పుడు ఇక్కడి నుంచే పర్యవేక్షించే వీలుంది. గణేష్‌ నిమజ్జనం శాంతియుతంగా పూర్తయ్యేలా శ్రమించిన పోలీసులకు అభినందనలు’’

- సీఎం కేసీఆర్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు