close

తెలంగాణ

రైతు కష్టం నీటిపాలు

 చెరువుకు భారీగా వరద
 కాల్వకట్ట తెగి వరి పంట మునక

రాయినిపాలెం (మిర్యాలగూడ గ్రామీణం), న్యూస్‌టుడే: చెరువులోకి భారీగా చేరిన వరద నీటిని కాల్వకు వదలగా దానికి గండిపడి 200 ఎకరాల వరి పంట మునిగింది. ఇటీవలి వర్షానికి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని రాయినిపాలెంలో పెద్ద చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో చెరువు కట్ట కింది వైపు ఓ ప్రదేశంలో నీరు ఊరి కట్ట తెగే పరిస్థితి నెలకొంది. ఆర్డీవో కేఎంవీ జగన్నాథరావు, ఐబీ అధికారులు చెరువు అలుగులకు గండి పెట్టించి నీటిని  కాల్వకు వదిలారు. ఆ కాల్వ కట్ట తెగి సుమారు 200 ఎకరాల వరి పంట నీట మునిగింది. మిషన్‌ కాకతీయ రెండో విడతలో భాగంగా పెద్ద చెరువుకు పునరుద్ధరణ పనులు చేశారు. నాణ్యత లేని పనులు చేయడం వల్లే చెరువు కట్ట తెగే పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఐబీ అధికారిణి విజయలక్ష్మిని వివరణ కోరగా.. మిషన్‌ కాకతీయ రెండో విడతలో పెద్దచెరువు పునరుద్ధరణకు 2016లో రూ.70 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. 15.20శాతం లెస్‌తో నిర్మాణ పనులను గుత్తేదారు పూర్తిచేశారన్నారు. చెరువులో ఎర్త్‌వర్క్‌ చేయలేదన్నారు. వర్షాలకు వరద నీరు భారీగా చెరువులో చేరుతుండడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు