close

తెలంగాణ

తితిదే మండలిలో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు

 చెన్నై శేఖర్‌రెడ్డికీ అవకాశం

ఈనాడు, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 24 మంది సభ్యులతో బుధవారమే పాలకమండలిని నియమించగా, తాజాగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. వీరిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితోపాటు వివిధ నగరాల్లో స్థానిక సలహా మండలి (ఎల్‌ఏసీ) అధ్యక్షులకు చోటు కల్పించారు. రాజ్యసభ సభ్యులు, దిల్లీ ఎల్‌ఏసీ అధ్యక్షులు రాకేశ్‌ సిన్హా, కుపేందర్‌రెడ్డి (బెంగళూరు), గోవింద హరి (హైదరాబాద్‌), దుశ్మంత్‌కుమార్‌ దాస్‌ (భువనేశ్వర్‌), అమోల్‌ కాలే (ముంబయి)తోపాటు గత పాలకమండలిలో సభ్యుడైన చెన్నైకి చెందిన శేఖర్‌ ఏజే (శేఖర్‌రెడ్డి)లను నియమించారు. వీరు ప్రత్యేక ఆహ్వానితులుగా మాత్రమే ఉంటారని, బోర్డులో తీర్మానాల ఆమోదానికి జరిగే ఓటింగ్‌లో పాల్గొనే అర్హత ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరికి తితిదే పాలకమండలి సభ్యుల మాదిరిగానే ప్రోటోకాల్‌ వర్తిస్తుందని ఆదేశాల్లో తెలిపారు. చెన్నైకి చెందిన శేఖర్‌రెడ్డి గత పర్యాయమూ తితిదే పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు. 2016లో ఆయన వ్యాపారసంస్థలు, ఇంట్లో ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.33.89 కోట్ల కొత్త 2వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేయడంతో డిసెంబరు 11న తితిదే పాలకమండలి నుంచి శేఖర్‌రెడ్డిని తొలగించారు. విచారణలో ఆ సొమ్మంతా శేఖర్‌రెడ్డి, అతని భాగస్వామ్యుల వ్యాపారాలదని తేలడంతో కేసులు కొట్టేశారు. ఆయన్ను తాజాగా తితిదే పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితునిగా అవకాశం కల్పించినట్లు సమాచారం.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు