close

గ్రేటర్‌ హైదరాబాద్‌

ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింటా అందాలు

పది డిజైన్లు... వంద రంగులు... కోటి చీరలు
బతుకమ్మ కోకలు సిద్ధం
ఆడపడుచులకు గౌరవం
16 వేల మంది కార్మికులకు ఉపాధి
వృద్ధులకు ప్రత్యేకంగా 9 మీటర్లతో తయారీ
ఈనాడు, హైదరాబాద్‌

బతుకమ్మ.. ఈపేరు వింటేనే తెలంగాణ మహిళ పులకిస్తుంది. పుట్టింటికి చేరి ఈ పూల పండుగలో పాలుపంచుకోవాలని తహతహలాడుతుంది. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ తోటివారితో ఆడిపాడి ప్రకృతిమాతకు వందనం చేసేందుకు పరితపిస్తుంది. ఈ పూల పండుగ ఈసారి సరికొత్త కాంతులీననుంది. పండుగకు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలను నాణ్యత, నవ్యతలతో రూపొందిస్తున్నారు. వందశాతం పాలియెస్టర్‌ ఫిలమెంటు నూలు, జరీ అంచులతో పది ఆకృతులు, వంద రంగుల్లో వీటిని అందంగా తయారు చేస్తున్నారు.

తుకమ్మ పండుగ సందర్భంగా 18 ఏళ్లు దాటిన పేద మహిళలకు  రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా చీరలను పంపిణీ చేస్తోంది. గత ఏడాది 99 లక్షల మందికి చీరలను ఇవ్వగా.. ఈసారి మరో మూడు లక్షలను అదనంగా ఉత్పత్తి చేశారు. దీని కోసం ప్రభుత్వం రూ. 313 కోట్లు విడుదల చేసింది. గతంలో 3 డిజైన్లు, 10 రంగుల్లో చీరలు ఉండేవి. పట్టణ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల  ఆధ్వర్యంలోని స్వయం సహాయక బృందాల మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా నిఫ్ట్‌ నిపుణులతో ఈసారి కొత్త డిజైన్లను ఉత్పత్తి చేశారు. దాదాపు 90 లక్షలమంది 60 ఏళ్ల లోపు మహిళల కోసం 6.30 మీటర్ల పొడవైన చీరలు తయారు చేశారు. పది లక్షల మంది 60 ఏళ్లు దాటిన మహిళల కోసం 9 మీటర్ల పొడవైన చీరలను తయారుచేశారు.

న్నేసి రంగుల్లో చీరలు కనువిందు చేస్తున్నాయి. ఏదో ప్రభుత్వ పథకం మాదిరిగా కాకుండా అందరికీ నచ్చే రంగుల్లో తయారు చేశారు.

-అలివేలు, బోడుప్పల్‌

సారి నాణ్యత చాలా బాగుంది. కంటికి ఇంపైన కొత్త రంగులు వచ్చాయి. చూడగానే నచ్చుతున్నాయి.

-రేణుక,  నర్సింగాపూర్‌, కరీంనగర్‌ జిల్లా

బతుకు దారి చూపిన బతుకమ్మ..

తుకమ్మ పండుగ సిరిసిల్లకు కొత్తకళ తెచ్చింది. నేత కార్మికుల జీవితాల్లో వెలుగు పూలు పూయిస్తోంది. ఒకప్పుడు పనుల్లేక వెలవెలబోయిన కార్మికవాడలు ఇప్పుడు సందడిగా మారాయి. నాడు ఇక్కడి నుంచి భీవండి, సూరత్‌ లాంటి ప్రాంతాలకు కార్మికులు వలస వెళ్లగా ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు. బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు అప్పగించడంతో ఈ మార్పు సాధ్యమైంది. చీరల ఉత్పత్తికి 10 వేలమంది కార్మికులు అవసరం కాగా జిల్లాలో 6 వేలమంది కార్మికులే ఉన్నారు. మిగతావారు ఇతర జిల్లాల నుంచి వచ్చారు. వారికి గదులను అద్దెకివ్వడం, భోజనశాలల ఏర్పాటుతో మరికొంతమంది ఉపాధి పొందుతున్నారు.
-ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

పండుగలోపే అందరికీ చీరలు

కోటిమంది మహిళలకు ఉచిత చీరల పంపిణీ దేశంలోనే వినూత్నమైన సంక్షేమ పథకం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్నాం. ఇది వందశాతం పేద మహిళలకు, మరమగ్గాల నేతన్నలకు ఉపయోగపడుతోంది. పంపిణీ ఏర్పాట్లు పకడ్బందీగా సాగుతున్నాయి. పండుగలోపే అందరికీ చీరలను అందిస్తాం.
-శైలజా రామయ్యర్‌, చేనేత, జౌళి కమిషనర్‌

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు