close

క్రైమ్

మావోయిస్టు మిలీషియా కమాండర్‌ అరెస్టు

వెంకటాపురం, న్యూస్‌టుడే: దండకారణ్యంలో మావోల కదలికలపై కన్నేసిన పోలీసులు.. మావోయిస్టు మిలీషియా కమాండర్‌ ఒకరిని నిర్బంధించారు. అతడిని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఊసూరు మండలం కమలాపురం గ్రామానికి చెందిన రేంగా రమేశ్‌గా గుర్తించారు. ఆ వివరాలను ములుగు జిల్లా వెంకటాపురంలో సీఐ కాగితోజు శివప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించే పోలీసులను దెబ్బకొట్టాలనే వ్యూహంలో భాగంగా మావోయిస్టు ఆర్పీఎఫ్‌ కమాండర్‌ సోది జోగా సూచనలతో రమేశ్‌.. ఏటూరునాగారం వెళ్లి రెండు టిఫిన్‌ బాక్సులు, కార్డెక్స్‌ వైర్‌ కొనుగోలు చేసి తిరిగి వెళ్తున్నారు. వెంకటాపురం మండల కేంద్రంలో పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 2011 నుంచి నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ ఊసూరు ఏరియా కమిటీతో పరిచయం ఏర్పడి అప్పటి నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నట్లు తేలింది. మిలీషియా సభ్యుడిగా చేరిన ఇతను 2017లో మిలీషియా ఏ సెక్షన్‌ కమాండర్‌ బాధ్యతలు చేపట్టి మావోయిస్టుల కార్యకలాపాలకు సహకరిస్తున్నారు. అతడిని అరెస్టు చేసి సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ప్రకాశ్‌, వెంకటాపురం ఎస్సై తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు