close

క్రైమ్

ఒకరికి బదులు మరొకరు కటకటాల్లోకి

పూర్తి విచారణ చేయకుండానే జైలుకు పంపిన వైనం

గోదావరిఖని, న్యూస్‌టుడే: అసలు నిందితుడిని పట్టుకోవాల్సిన పోలీసులు విచారణ చేయకుండానే అత్యుత్సాహం చూపించారు. ఒకే పేరు ఉన్న పాపానికి నేరంతో సంబంధం లేని వ్యక్తిని కటకటాల పాలు చేసిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన తోట వేణుపై ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు ఈ నెల 11న కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కొత్తపేట జైలుకు పంపించారు. చోరీ కేసులో పట్టుబడ్డ దొంగ ఇచ్చిన సమాచారంతో అసలు నిందితుడిని పట్టుకోకుండా అదే పేరుతో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రుకు చెందిన బండి దుర్గాప్రసాద్‌, కాసా శ్రీనివాస్‌ రావులపాలెం  ప్రాంతంలో చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు విచారించగా చోరీలకు పాల్పడిన విషయాన్ని ఒప్పుకొన్నారు. చోరీసొత్తులో కొంత మొత్తాన్ని పెద్దపల్లికి చెందిన తోట వేణు, అరికెల శ్యామ్‌కు ఇచ్చామని వెల్లడించారు. దీంతో అరికెల శ్యామ్‌ను పట్టుకున్న పోలీసులు తోట వేణు కోసం ప్రయత్నించగా దొరకలేదు. ఈ క్రమంలోనే వరంగల్‌ జైలులో గోదావరిఖనికి చెందిన తోట వేణు ఉన్నట్లు తెలుసుకున్నారు. తనకు ఆ కేసుతో సంబంధం లేదని చెప్పినా వినకుండా అదుపులోకి తీసుకున్నారు.నిందితుడు తోట వేణు పరారీలో ఉన్నాడు.  ఈ విషయమై రావులపాలెం పోలీసుస్టేషన్‌ సీఐ క్రిష్ణని వివరణ కోరగా జరిగిన పొరపాటును గుర్తించామన్నారు.అసలు నిందితుడిని త్వరలో పట్టుకుంటామన్నారు. కేసుతో సంబంధం లేని వ్యక్తిని తిరిగి పంపిస్తామన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు