close

క్రైమ్

వైద్యుడికి టోకరా.. నిందితుడి అరెస్ట్‌

 విత్తనాల సరఫరా పేరుతో   రూ.1.40 కోట్లు దండుకున్న మోసకారి

ఈనాడు, హైదరాబాద్‌: విత్తనాలు, మందుల సరఫరా కాంట్రాక్ట్‌ పేరుతో ఓ వైద్య నిపుణుడి నుంచి రూ.1.40 కోట్లు కొల్లగొట్టిన ఘరానా నిందితుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గురు పట్టాభిరామన్‌ చౌదరి అనే వ్యక్తికి.. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేస్తున్న జి.నర్సింగరావుతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పట్టాభి.. ప్రధానమంత్రి కృషి యోజన పథకం కింద రైతులకు ఇచ్చే విత్తనాలు, మందులను జైటెక్స్‌ బయోటెక్‌ కంపెనీ (ముంబయి) పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని, దాని ప్రతినిధులు తనకు తెలుసని డాక్టర్‌కు తెలిపాడు. జైటెక్స్‌ కంపెనీకి పశ్చిమబెంగాల్‌తో విత్తనాలు సరఫరా చేసే ఒప్పందం కుదిరిందని ఫోర్జరీ పత్రాలను చూపించాడు. ఆ కంపెనీ తరఫున సబ్‌కాంట్రాక్ట్‌ తరహాలో పశ్చిమబెంగాల్‌కు విత్తనాలు, మందులు సరఫరా చేద్దామని వివరించాడు. కంపెనీ ప్రతినిధులు 20 శాతం రాయితీ ఇస్తారని, విక్రయాలతో రూ.కోట్లలో లాభం వస్తుందని నమ్మించాడు. దీంతో వైద్యుడు 2018 మార్చిలో పట్టాభికి విడతల వారీగా రూ.1.40 కోట్లు ఇచ్చాడు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వస్తానంటూ ఏప్రిల్‌లో పట్టాభి ముంబయి వెళ్లాడు. అప్పటినుంచి ఆచూకీ లేడు.వైద్యనిపుణుడు మోసపోయానని గ్రహించి హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)లో జులై చివరి వారంలో ఫిర్యాదు చేశారు. నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన అధికారులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. టాటా ఫెర్టిలైజర్‌ కంపెనీలో సీనియర్‌ అధికారిగా పనిచేసిన పట్టాభి అక్కడ అక్రమాలకు పాల్పడడంతో రెండేళ్ల క్రితం ఆ కంపెనీ విధుల్లోంచి తొలగించిందని పోలీసులు తెలిపారు. డాక్టర్‌ నర్సింగరావుతో పాటు ఇంకా పలువురిని పట్టాభి మోసం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కోర్టు అనుమతి తీసుకుని మళ్లీ విచారించనున్నట్లు సంయుక్త కమిషనర్‌ (నేర పరిశోధన) అవినాష్‌ మహంతి తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు