close

క్రైమ్

దొంగా దొంగా దొరికాడు..  పోలీస్‌ బండిలో పారిపొయ్యాడు!

ఈనాడు డిజిటల్‌, గద్వాల.. ఉండవల్లి, న్యూస్‌టుడే: అతడో నిందితుడు.. దొంగతనానికి ప్రయత్నించే క్రమంలో జనం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రెండురోజులు ఠాణాలో ఉన్న ఆ దొంగ పోలీసుల కళ్లుగప్పి ఏకంగా పోలీసు వాహనంలోనే పరారయ్యాడు. ఈ ఉదంతం జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈనెల 16వ తేదీ అర్ధరాత్రి ఓ దొంగ అలంపూర్‌ చౌరస్తా సమీపంలోని ఒక ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాడు. పక్కింటివాళ్లు ఇది గమనించి అతడు దూరిన ఇంటికి బయటి నుంచి తాళం వేశారు. అయితే వెనుకవైపు తలుపులు తెరుచుకుని బయటపడిన దొంగ పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి దాక్కోగా స్థానికులు పట్టుకొని ఉండవల్లి పోలీసులకు అప్పగించారు. 17, 18 తేదీల్లో పోలీస్‌ స్టేషనులోనే ఉన్న అతడు గురువారం తెల్లవారుజామున కానిస్టేబుళ్లు నిద్రలో ఉండడాన్ని గమనించి తెలివిగా తప్పించుకున్నాడు. ఏకంగా స్టేషను ఆవరణలోని పోలీసు వాహనాన్ని తీసుకొని పరారయ్యాడు. తక్కశిల గ్రామం వద్ద ఆ వాహనం వదిలి వెళ్లిపోయాడు. అతడు వాహనాల చోరీలో ఆరితేరినవాడని.. హైదరాబాద్‌లో మెకానిక్‌ షెడ్డు నిర్వహిస్తున్నాడని సమాచారం. ఈ విషయమై.. జోగులాంబ గద్వాల జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ అపూర్వారావును ‘ఈనాడు’ వివరణ కోరగా.. దీనిపై విచారణ జరిపి శుక్రవారం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు