close

క్రైమ్

వీడ్కోలు పలికి వస్తూ.. మృత్యుఒడికి

  కారును ఢీకొన్న డీసీఎం
  నలుగురి మృతి
  మృతుల్లో దంపతులు, తోటికోడలు

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌ -న్యూస్‌టుడే, మహబూబాబాద్‌, దేవరుప్పుల రూరల్‌: లండన్‌లో ఉన్నత విద్యకు వెళుతున్న అన్న కుమారుడికి శంషాబాద్‌ విమానాశ్రయంలో వీడ్కోలు పలికి వస్తున్న బాబాయి- పిన్ని, మరో పిన్ని, కారు డ్రైవర్‌ మృత్యువాత పడ్డారు. మరో గంటలో ఇల్లు చేరుతామనగా.. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం శివారులోని జనగామ- సూర్యాపేట జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన కిరాణా వ్యాపారి పెనుగొండ సదాశివుడు తన రెండో కుమారుడు సాయిశంకర్‌ను ఉన్నత చదువుల కోసం లండన్‌ పంపించేందుకు బుధవారం రాత్రి 9.40 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి రెండు కార్లలో శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లారు. కుమారుడిని గురువారం తెల్లవారుజామున 4.45 గంటలకు విమానం ఎక్కించి 5.15కు మహబూబాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఓ కారులో సదాశివుడి తమ్ముడు గణేశ్‌, ఆయన భార్య సుకన్య, చిన్న తమ్ముడి భార్య శ్రీలత, సదాశివుడి భార్య మంజూష వస్తున్నారు. ఈ కారు కామారెడ్డిగూడెం శివారుకి రాగానే ఓ లారీ వేరే వాహనాన్ని దాటుకొని వస్తూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ నజీర్‌ (50), పెనుగొండ గణేశ్‌ (53), ఆయన భార్య సుకన్య (45) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన శ్రీలత (35)ను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న మంజూషను వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన సుకన్య-గణేశ్‌ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీలతకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. డ్రైవర్‌ నజీర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మధ్యలోనే తిరుగు పయనం
తనకు వీడ్కోలు పలికిన గంటల్లోనే కుటుంబ సభ్యులు ముగ్గురు ప్రమాదంలో మృతి చెందిన సమాచారాన్ని తెలుసుకున్న సాయిశంకర్‌ మధ్యలో అబుదాబి నుంచి స్వదేశానికి తిరుగు పయనమైనట్లు బంధువులు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు