close

సినిమా

అగ్ర దర్శకులతో  హీరోగా వినాయక్‌

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్‌ చిత్రాలను అందించిన దర్శకుడు వి.వి.వినాయక్. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. బుధవారం వి.వి.వినాయక్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘సీనయ్య’ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు సుకుమార్‌, అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాత దిల్‌రాజు హాజరయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వి.వి.వినాయక్‌పై క్లాప్‌ కొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా  అభిమానులతో పంచుకుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుందని చిత్ర బృందం తెలిపింది. ‘సీనయ్య’ సినిమాకి నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నారు.

‘ఆది’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘దిల్‌’, ‘ఠాగూర్‌’, ‘లక్ష్మి’, ‘అదుర్స్‌’, ‘నాయక్’, ‘ఖైదీ నంబర్‌ 150’ వంటి చిత్రాలతో ఆయా హీరోలకు మంచి విజయాన్ని అందించారు వినాయక్‌. 2018లో విడుదలైన ‘ఇంటిలిజెంట్‌’ సినిమాకి ఆయన దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు.


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు