close

బిజినెస్‌

భూవివాదాలు..బ్లాక్‌చైన్‌తో  భూస్థాపితం

డాక్టర్‌ బి. గోపాల కృష్ణ

భూవివాదాల నేపథ్యంలో ఇటీవల ఓ తహశీల్దారు సజీవ దహనం కావడం సంచలనం సృష్టించింది. అధికారి, హంతకుడి మధ్య భూ రికార్డుల విషయంలో వాగ్వాదం జరిగిందన్న కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం పక్కనపెడితే.. భూరికార్డుల్లో లేదా పాసుపుస్తకాల్లో దిద్దుబాట్ల కోసం ఎంతో మంది వేచిచూస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో అవినీతి పెరిగిందన్న ఫిర్యాదులు సైతం కనిపిస్తూనే ఉన్నాయి. వివాదాలకు, అవినీతికి తావు లేకుండా వ్యవస్థను రూపొందించలేమా? ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం ఇస్తోంది బ్లాక్‌ చైన్‌ సాంకేతికత.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌చైన్‌ ఆధారిత వ్యవస్థలకు ఆదరణ పెరిగింది. ఇ-గవర్నెన్స్‌కు మద్దతినిచ్చే ఈ వ్యవస్థలను స్వీడన్‌ వంటి దేశాలు అభివృద్ధి చేస్తున్నాయి. భారత్‌ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే తొలిసారిగా రెండు విభాగాల్లో బ్లాక్‌చైన్‌ సాంకేతికతను పైలట్‌ ప్రాజెక్టు కింద మొదలుపెట్టింది. మొత్తం అన్ని విభాగాల్లోనూ దీనిని తీసుకురావాలని చూస్తోంది.

భూ రిజిస్ట్రేషన్‌లో సవాళ్లు: వివిధ ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు ఈ భూరికార్డులను నిర్వహిస్తున్నారు. అయితే రికార్డుల ఫోర్జింగ్‌ విషయంలో దేశవ్యాప్తంగా పలు ఉదాహరణలు కనిపిస్తూనే వచ్చాయి. భూ రికార్డులను నవీకరించే సమయంలో పలు అవకతవకలు, అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. తమ భూ రికార్డులు, పాస్‌పుస్తకాల్లో దిద్దుబాట్లు; పాస్‌పుస్తకాల జారీ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలుదారు, విక్రేత రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి, రిజిస్ట్రార్‌ సమక్షంలో భౌతికంగా పత్రాల రూపంలో క్రయవిక్రయాలు జరుపుతుంటారు. ఈ నేపథ్యంలో భూ రిజిస్ట్రేషన్‌ అంశంలో ఎదురయ్యే సవాళ్లేమిటంటే..

* లాండ్‌ టైటిల్స్‌ స్పష్టంగా ఉండకపోవడం.
* భూ రికార్డుల డూప్లికేట్లు
* భూ రికార్డులను భద్రపరచడం కష్టమైన పని. ఇక వాటిని నవీకరించడం, తనిఖీ చేయడం సవాలే.
* చాలా వరకు సమాచారం పూర్తిగా లేకపోవడం
* భూ రికార్డులకు పలు వెబ్‌పోర్టళ్లు ఉన్నా.. దాదాపు అన్నింటిలోనూ సరైన నిజాలు లభ్యం కాకపోవచ్చు.

ఈ సవాళ్ల నేపథ్యంలోనే ఒక భద్రమైన, పేపరు రహిత, దీర్ఘకాలం ఉండగలిగే ఒక ఆన్‌లైన్‌ పరిష్కారాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు.

ఎలా పనిచేస్తుందంటే..: ఏదైనా లావాదేవీ జరిగినపుడు ఒక విస్తృత వ్యవస్థ ద్వారా ఒక శాశ్వత, తనిఖీ చేసిన, మార్పులకు అవకాశం లేని సమాచారాన్ని ఈ బ్లాక్‌చైన్‌ అల్గారిథమ్స్‌ ద్వారా సృష్టించవచ్చు. ఒక డిజిటల్‌ సంతకంతో రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాన్ని సృష్టిస్తారు. పలు భద్రత అంశాలను జత చేసి ఒక విశిష్ఠ రికార్డును రూపొందిస్తారు. ఒక వేళ ఇందులో ఏదైనా మార్పు చేయాలనుకుంటే మొత్తం పత్రాన్ని మార్చాలి తప్ప.. చిన్న చిన్న దిద్దుబాట్లు చేయడం అసాధ్యం.

అవినీతికి ఆస్కారం ఉండదు

భూరికార్డుల నిర్వహణను పారదర్శకంగా, నూరు శాతం సమర్థతతో నిర్వహించడానికి బ్లాక్‌చైన్‌ సాంకేతికత ఉపయోగపడుతుంది. భూ నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఈ సాంకేతికత వినియోగం ద్వారా పారదర్శకత వస్తుంది. వేగం పెరుగుతుంది. మధ్యంతర వ్యవస్థలు ఉండవు. అన్నిటికీ మించి మోసాలు జరగవు. ఎందుకంటే ఫోర్జరీ చేయడానికి కానీ, అవకతవకలకు పాల్పడడానికి కానీ వీలుండదు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పారదర్శకత పెరగడం వల్ల అవినీతి పనులకు ఆస్కారం కనిపించదు.

ఇతర విభాగాల్లోనూ..

ఒక్క భూరికార్డుల విషయంలోనే కాదు ఒక ప్రభుత్వం స్మార్ట్‌ ప్రభుత్వంగా మారాలంటే పలు విభాగాల్లోనూ ఈ బ్లాక్‌ చైన్‌ సాంకేతికతను వినియోగించుకోవచ్చు. ఎన్నికల్లో పౌరులు తాము వేసే ఓటును, ఫలితాలను తనిఖీ చేసుకునేందుకు; రుణాలు, బీమా వంటి విషయాల్లో తనిఖీ,భద్రతకు; ఇళ్ల కొనుగోలుదార్లు గృహ యజమాని ఎవరో తెలుసుకోవడానికి; పలు ప్రభుత్వ విభాగాల మధ్య పత్రాలను పంచుకోవడానికి; రుణాలు, నిధుల పంపిణీని సులువుగా చేసుకోవడానికి సైతం ఈ సాంకేతికతను విరివిగా ఉపయోగించుకునే వీలుంది. ఇక విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లోనూ భద్రత, పారదర్శకతకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

మొత్తం మీద బ్లాక్‌చైన్‌ ఆధారిత స్మార్ట్‌ ప్రభుత్వ అప్లికేషన్ల వల్ల ప్రభుత్వ సామర్థ్యం పెరుగుతుంది. లావాదేవీల వ్యయాలు తగ్గుతాయి. ప్రభుత్వానికి, ప్రజలకు సమాచారం వేగంగా బదిలీ అవుతుంది. అన్ని పౌర సేవలు, లీగల్‌ కాంట్రాక్టులను క్రమబద్ధీకరించడానికి; ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకతను పెంచడానికి బ్లాక్‌చైన్‌ను గట్టిగా విశ్వసించవచ్చు.

(వ్యాసకర్త విప్రో టెక్నాలజీస్‌ గౌరవ సభ్యులు)

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు