close

క్రీడలు

భారత్‌ అమ్మాయిలదే వన్డే సిరీస్‌

నార్త్‌ సౌండ్‌ (ఆంటిగ్వా): వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత అమ్మాయిలు.. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకున్నారు. స్మృతి మంధాన (74; 63 బంతుల్లో 9×4, 3×6), జెమీమా రోడ్రిగ్స్‌ (69; 92 బంతుల్లో 6×4) సత్తా చాటడంతో మూడో వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది. మొదట జులన్‌ గోస్వామి (2/30), పూనమ్‌ యాదవ్‌ (2/35)ల ధాటికి విండీస్‌ 50 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. మంధాన, జెమీమా మెరుపులతో భారత్‌ 42.1 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి తన శైలిలో ధాటిగా ఆడగా.. జెమీమా ఆచితూచి పరుగులు చేసింది. ఈ జోడీ తొలి వికెట్‌కు 141 పరుగులు జత చేసి గట్టి పునాది వేసింది.. అయితే వీళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగినా.. పూనమ్‌ రౌత్‌ (24), మిథాలీరాజ్‌ (20) జట్టును విజయపథంలో నడిపించారు. 66 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో పూనమ్‌, మిథాలీ ఔటయ్యారు. దీప్తి శర్మ (4 నాటౌట్‌), హర్మన్‌ప్రీత్‌ (0 నాటౌట్‌) లాంఛనం పూర్తి చేశారు. సిరీస్‌లో నాలుగు పాయింట్లు సంపాదించిన భారత జట్టు.. 20 పాయింట్లతో ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు