close

క్రీడలు

స్టంపే..కానీ కాదు

బంగ్లా ఓపెనర్లు నయీమ్‌, లిటన్‌ దాస్‌ జోరు మీదున్నారు. 5 ఓవర్లకు స్కోరు 41/0. కానీ చాహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో ముందుకొచ్చి భారీ షాట్‌ ఆడబోయిన లిటన్‌ దాస్‌ తేలిగ్గా స్టంపౌటైపోయాడు. భారత ఆటగాళ్లు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కానీ అంతలోనే షాక్‌! లిటన్‌ను అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. వికెట్‌ కీపర్‌ పంత్‌ తప్పిదంతో అది నోబాల్‌ అయిపోయింది.

మరోసారి..: పంత్‌ మరోసారి అదే తప్పు చేసేలా కనిపించాడు. 13వ ఓవర్‌ ఆఖరి బంతికి చాహల్‌ బౌలింగ్‌లో ముందుకెళ్లిన సౌమ్య సర్కార్‌ను అతడు స్టంపౌట్‌ చేశాడు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ మూడో అంపైర్‌కు నివేదించాడు. దాదాపుగా ముందులానే స్టంప్స్‌కు చేరువలో పంత్‌ బంతి అందుకుని స్టంపౌట్‌ చేశాడు. పొరపాటుగా మూడో అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడంతో అంతా విస్తుపోయారు. వెంటనే అతడు నిర్ణయాన్ని సరిచేసి.. సౌమ్యను ఔట్‌గా ప్రకటించాడు.

ఎందుకలా..: పంత్‌ స్టంపౌట్‌ చేసిన విధానంపై మైదానంలోని అంపైర్లకు అనుమానమొచ్చి మూడో అంపైర్‌ను సంప్రదించారు. బంతిని అందుకునేటప్పుడు పంత్‌ గ్లోవ్స్‌.. స్టంప్స్‌ దాటి కాస్త ముందుకు వచ్చినట్లు రీప్లేలో తేలడంతో అంపైర్‌ నోబాల్‌ ఇచ్చాడు. లిటన్‌ బతికిపోయాడు. ఫ్రీహిట్‌ను బౌండరీకి తరలించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం వికెట్‌కీపర్‌.. బంతిని స్టంప్స్‌ వెనకే అందుకోవాలి.

ఇంతకుముందు ఇలా జరిగిందా..: క్రికెట్లో పంత్‌లా వికెట్‌కీపర్లు అత్యుత్సాహం ప్రదర్శించడం కొత్తేం కాదు. గతేడాది ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా పర్యటించినపుడు ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ.. బంతి వికెట్లు దాటక ముందే స్టంప్స్‌ను తాకాడు. క్రీజులో ఉన్న రాహుల్‌.. ఆడమ్‌ జంపా బంతిని బ్యాక్‌ఫుట్‌పై ఆడాడు. అదే సమయంలో స్టంప్స్‌ వెలిగాయి. దాంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు హిట్‌ వికెట్‌ కోసం అప్పీల్‌ చేశారు. కానీ రాహుల్‌ బంతిని ఆడే సమయంలో కేరీ గ్లోవ్స్‌ స్టంప్స్‌ను తాకాయని రిప్లేలో తేలింది. దాంతో అంపైర్‌ నోబాల్‌ ప్రకటించాడు.

నిబంధన ఏమిటీ..

ఐసీసీ 27.3 నిబంధన ప్రకారం... బౌలర్‌ బంతి వేసినప్పటి నుంచి.. అది బ్యాట్స్‌మన్‌ బ్యాట్‌కు కానీ అతని శరీరానికి కానీ తాకడం లేదా స్టంప్స్‌ను దాటి వెళ్లేంత వరకు, లేదా బ్యాట్స్‌మన్‌ పరుగుకు ప్రయత్నించే వరకూ వికెట్‌ కీపర్‌ స్టంప్స్‌ వెనకాలే ఉండాలి. అతని గ్లోవ్స్‌ లేదా శరీరం ఎట్టి పరిస్థితుల్లోనూ స్టంప్స్‌ దాటి ముందుకు రాకూడదు. వికెట్‌ కీపర్‌ ఈ నియమాన్ని అతిక్రమించినట్లయితే అంపైర్‌ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటిస్తాడు.
|

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు