close

గ్రేటర్‌ హైదరాబాద్‌

పారాహుషార్‌!

అయోధ్యపై తీర్పు నేపథ్యంలో అప్రమత్తత
భద్రత కట్టుదిట్టం చేయండి
రాష్ట్రాలకు కేంద్రం సూచన
రైల్వే భద్రతా దళానికి సెలవులు రద్దు

దిల్లీ: అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు త్వరలో ఇవ్వనున్న నేపథ్యంలో దేశం మొత్తం నిఘా నీడలోకి వెళుతోంది. రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం గురువారం సూచించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు  దాదాపు 4వేల మంది పారామిలటరీ బలగాలను పంపింది. అయోధ్యలో మోహరింపును ముమ్మరం చేసింది. మరోవైపు రైల్వేపోలీసు దళం (ఆర్‌పీఎఫ్‌) కూడా దేశంలోని అన్ని రైల్వే జోన్లకూ అప్రమత్తత సందేశాన్ని పంపింది. సిబ్బంది సెలవులను రద్దు చేయాలని, రైళ్లకు భద్రత పెంచాలని ఏడు పేజీల లేఖలో కోరింది. రైల్వే ప్లాట్‌ఫారంలు, స్టేషన్లు, యార్డులు, పార్కింగ్‌ ప్రదేశాలు, వంతెనలు, సొరంగాలు, వర్క్‌షాపులు, ఉత్పాదక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది. హింసకు, పేలుడు పదార్థాలు దాచే అవకాశాలున్న ప్రదేశాలను గుర్తించి, ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలంది. రైల్వే ప్రాంగణాల్లోను, సమీపంలోను ఉన్న మతపరమైన నిర్మాణాలపై కన్నేసి ఉంచాలని కోరింది. రాత్రివేళ స్టేషన్‌లో రైళ్లు లేనప్పుడు 30 శాతం లైట్లను మాత్రమే వాడాలన్న ఉత్తర్వునూ వెనక్కి తీసుకుంది. 100 శాతం లైట్లను వెలిగించాలని ఆదేశించింది. వీవీఐపీలు, సైన్యం కదలికలపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించాలని కోరింది. అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికులపై కన్నేసి ఉంచాలని ట్యాక్సీ డ్రైవర్లకూ సూచించాలని నిర్దేశించింది.

మరోవైపు ఈ నెల 12న కార్తిక పౌర్ణమి నేపథ్యంలో అయోధ్యకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత వారు కొంతకాలం అక్కడే ఉంటారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నారు.

అయోధ్య తీర్పు అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులతో చర్చించారు. ఈ అంశంపై అనవసర వ్యాఖ్యలు చేయరాదని, దేశంలో సామరస్యాన్ని కాపాడాలని వారికి సూచించారు.

వ్యూహాన్ని ఖరారు చేయనున్న కాంగ్రెస్‌
అయోధ్య అంశంపై పార్టీ వైఖరిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆదివారం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ వివాదంపై తీర్పు వచ్చాక పార్టీ నేతలంతా ఒకే వాదన వినిపించేలా చూడాటానికి నిర్దిష్టంగా ఒక వ్యూహాన్నీ సిద్ధం చేస్తామని కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పునకు తాము కట్టుబడి ఉంటామని, అందరూ దాన్ని గౌరవించాలని ఇప్పటివరకూ కాంగ్రెస్‌ చెబుతూ వస్తోంది. ప్రజల సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటూ తీర్పు అనంతరం దృఢ వైఖరిని అవలంబించాలని అంతర్గతంగా డిమాండ్లు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పరాజయంపై ఎ.కె.ఆంటోనీ కమిటీ సూచనలకు అనుగుణంగా కాంగ్రెస్‌ తన వైఖరిని మార్చుకుంటోంది. ‘మతతత్వానికి వ్యతిరేకంగా లౌకికవాద పోరు’ అనే నినాదంతో ఎన్నికల్లోకి దిగడం వల్ల పార్టీకి నష్టం కలిగిందని ఆ కమిటీ పేర్కొంది.

ఆగిన పనులు
రామ మందిరం నిర్మాణం కోసం అయోధ్యలో సాగుతున్న శిలలను చెక్కే పని ఆగిపోయింది. తీర్పు రానున్న నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) అగ్రనేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 1990ల నుంచి ఈ పనిని నిలిపివేయడం ఇదే తొలిసారి.

అయోధ్యపై ఉగ్ర పడగ!
అయోధ్యకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. బాంబులను నిర్వీర్యం చేసే 30 బృందాలను ఇక్కడ మోహరించారు. పట్టణంలోని ధర్మశాలల్లో ఉన్న వారందరినీ ఈ నెల 12లోగా ఖాళీ చేయించాలని నిర్వాహకులకు అధికారులు సూచించారు. ఈ నెల 10 నాటికి 300 కంపెనీల భద్రతా దళాలను అయోధ్యలో మోహరించనున్నట్లు తెలిపారు. వివాదాస్పద ప్రాంతానికి చేరువలోని రామ్‌ కోట్‌కు దారితీసే అన్ని రోడ్లను పోలీసులు మూసేశారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు