close

ఆంధ్రప్రదేశ్

వాటి జోలికి పోవద్దు

సౌర విద్యుత్తు ప్లాంట్లపై రాష్ట్రాలకు కేంద్రం స్పష్టీకరణ
ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే స్వేచ్ఛ వాటికి ఉంది..
ఇందుకు లైసెన్సు అవసరం లేదని వెల్లడి
ఈనాడు - దిల్లీ

 సాంకేతిక అంశాలను సాకుగా చూపి సౌర విద్యుత్తు సంస్థలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ముకుతాడు వేసేలా కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం ప్రకారం విద్యుత్తు కొనుగోళ్ల వరకే పరిమితం కావాలి తప్పితే ప్లాంట్ల జోలికి వెళ్లకూడదని నిర్దేశించింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ప్రకారం విద్యుత్తు సరఫరా చేయడానికి వీలుగా సౌర విద్యుత్తు సంస్థలు డైరెక్టు కరెంటు (డీసీ) విద్యుత్తు సామర్థ్యం పెంచుకోవడానికి ప్రయత్నించే సమయంలో కొన్ని ప్రభుత్వాలు అడ్డుతగలడాన్ని తప్పుబట్టింది. ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సౌర విద్యుత్తు ఉత్పత్తిదారులకు ఇబ్బంది లేకుండా చూడటం కోసం సౌర ప్రాజెక్టుల్లో అదనపు డైరెక్ట్‌ కరెంటు (డీసీ) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకొనే స్వేచ్ఛను ఆయా విద్యుత్తు సంస్థలకే వదిలిపెడుతున్నట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇతరత్రా ఏజెన్సీలుకానీ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని హెచ్చరించింది. ఆయా ప్లాంట్ల ఆల్టర్నేటివ్‌ కరెంటు (ఏసీ) ఉత్పత్తి సామర్థ్యం విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి లోబడి ఉన్నంతవరకూ డీసీ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎంత పెంచుకున్నా అధికారులు అడ్డుపడడానికి వీల్లేదని పేర్కొంది. ఉత్పత్తి సంస్థలు కెపాసిటీ యుటిలైజేషన్‌ ఫ్యాక్టర్‌కు అనుగుణంగా విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ఈ విషయంలో లైసెన్సులు అవసరం లేనందున దేశవ్యాప్తంగా ఏ వ్యక్తి అయినా తనకు ఇష్టమొచ్చినంత సామర్థ్యంలో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని ఎవరు కొనడానికొస్తే వారికి విక్రయించుకోవచ్చని పేర్కొంది.  ‘‘ఒప్పందాల ప్రకారం పంపిణీ సంస్థలకు ఏసీ కరెంటు సరఫరా చేయాలంటే అదనపు డీసీ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానం. ఇలాంటి ఏర్పాటుకు కొన్ని రాష్ట్రాలు అడ్డుతగులుతున్నాయంటూ ఉత్పత్తిదారులు మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న విధానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, డిస్కంలు నిర్దిష్ట పరిమాణంలో సౌర విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు బిడ్లను ఆహ్వానిస్తాయి. అందులో నెగ్గిన బిడ్డరుతో ఒప్పందం చేసుకుంటాయి. వీటిపై సంతకం చేసిన కొనుగోలుదారు.. హామీ ఇచ్చినంత మేర కొనుగోలు చేయలేకపోతే ఉత్పత్తి సంస్థకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఉత్పత్తిదారు ఒప్పందం మేర సరఫరా చేయకపోతే కొనుగోలుదారుకి జరిమానా కట్టాల్సి వస్తుంది. సౌర విద్యుత్తు ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి పీపీఏల ప్రకారం ఏసీ కరెంటు సరఫరా చేయడానికి వీలుగా ఉత్పత్తిదారులు అదనపు డీసీ ప్యానల్స్‌ ఏర్పాటు చేసుకుంటారు. అది ఒప్పంద ఉల్లంఘన కాదు. అలా ఉత్పత్తి చేసే అదనపు విద్యుత్తును ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి సౌర విద్యుత్తు సంస్థలు ఏర్పాటు చేసుకొనే అదనపు డీసీ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం వల్ల కొనుగోలుదారులపై అదనపు భారం పడదు. అందువల్ల ప్రభుత్వరంగ సంస్థలు సౌర విద్యుత్తు ప్లాంటు డిజైన్‌, దాని డీసీ ఉత్పత్తి సామర్థ్యం జోలికి పోకుండా కేవలం వాటి ఏసీ విద్యుత్తు ఉత్పత్తి గురించి మాత్రమే దృష్టిసారించాలి’’ అని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు