close

ఆంధ్రప్రదేశ్

తెలుగు జాతి మనుగడకే ముప్పు

తెలుగు మాధ్యమం ఎత్తివేత అశాస్త్రీయం
అధికార భాషా సంఘం ఏం చేస్తోంది?
సర్కారు బడుల్లో ఆంగ్లమాధ్యమం నిర్ణయంపై గళమెత్తిన భాషావేత్తలు

ఈనాడు - అమరావతి

తెలుగుకు నిలువునా సమాధే... అమృత  తుల్యమైన భాష చచ్చిపోతుంది... మన జాతి మనుగడకే ముప్పు... ఇది మనకు మనం చేసుకుంటున్న ద్రోహం... రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో  వచ్చే ఏడాది నుంచి ఆంగ్లమాధ్యమంలోనే బోధించాలని సర్కారు తీసుకున్న నిర్ణయంపై భాషావేత్తల ఆవేదన ఇది. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో మనవారు చదువుకుంటున్న పాఠశాలల్లో తెలుగు మాధ్యమం ఉంటే... భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ విపరీత పోకడలు ఏమిటని భాషాభిమానులు, భాషావేత్తలు, విద్యావేత్తలు, రచయితలు నిరసిస్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లో తెలుగు సంతతికి చెందిన పిల్లలకు... అక్కడి ప్రభుత్వాలే పూనుకుని మనభాషను బోధిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం తెలుగు వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే, రాష్ట్ర అధికార భాషా సంఘం ఏం చేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు.

దేశ క్షేమానికి భాషా క్షేమం పునాది అని పెద్దలు ఎప్పుడో చెప్పారని, ఒక భాష నశిస్తే ఒక జాతి నశించినట్టే... అని భాషావేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని యునెస్కో చెప్పిన విషయాన్ని విస్మరించడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కస్తూరి రంగన్‌ కమిటీ తమ ముసాయిదా నివేదికలో... కనీసం ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన సాగాలని సిఫారసు చేయడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. చైనా, రష్యా, జపాన్‌ వంటి దేశాల్లో శాస్త్ర సాంకేతిక అంశాలు సహా, అన్ని సబ్జెక్టులనూ వారి మాతృభాషలోనే బోధిస్తున్న విషయాన్ని మరవొద్దన్నారు. పాలనా వ్యవహారాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే సాగేలా చర్యలు చేపట్టాలని, తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారికి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు...

సమాజం నిర్వీర్యమవుతుంది

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాజాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఆంగ్లాన్ని ఒక భాషగా మాత్రమే నేర్చుకోవడంలో తప్పులేదు. మొత్తం బోధనే ఆంగ్లమాధ్యమంలో చేస్తామనడం సరికాదు. తెలుగువారికి ఇది అంతులేని అవమానాన్ని, ఆక్రోశాన్ని, ఆవేదనను కలిగించే పరిణామం. ప్రపంచంలో ఏడు వేలకు పైచిలుకు భాషలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 85 శాతం 100 భాషల్నే వినియోగిస్తున్నారు. వాటిలో 25 భాషలు ప్రపంచ జనాభాలో సగం మందికి వాడుక భాషలు. ఈ 25 భాషల్లో తెలుగు 13వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచ స్థాయి భాషగా ఉన్న తెలుగును విద్యా మాధ్యమంగా వాడుక నుంచి తొలగించడం అంటే ప్రజాస్వామ్య విధానాల్ని పట్టించుకోనట్టే.

- ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, భాషాశాస్త్ర శాఖ, హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీ

12 దేశాల్లో తెలుగు బోధన

చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువర్గం ద్వారా విన్న భాషలోనే విద్యాభ్యాసం సులువు. అప్పుడే పిల్లలు భావవ్యక్తీకరణలోనూ, రాయడంలోనూ రాణిస్తారు. ఇతర రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో తెలుగు బోధిస్తున్నారు. దిల్లీలో దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ నెలకొల్పిన ఆంధ్రా ఎడ్యుకేషన్‌ సొసైటీ ఐదు క్యాంపస్‌ల్లో తెలుగు నేర్పిస్తున్నారు. ఒక క్యాంపస్‌లో పూర్తిగా తెలుగు మాధ్యమంలోనే బోధన సాగుతోంది. అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల్లో ప్రభుత్వమే తెలుగు బోధిస్తోంది. ఆ పాఠ్యాంశాల్ని నేనే రూపొందించాను. అండమాన్‌, నికోబార్‌లోనూ తెలుగు మాధ్యమం ఉంది. ఇక్కడ తీసేస్తే ఎలా?

- ప్రొఫెసర్‌ మునిరత్నంనాయుడు, డైరెక్టర్‌, మైసూరు ప్రాచీన భాషా పరిశోధన కేంద్రం

చివరకు ఏ భాషా రాదు

ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు సమాధి అవుతుంది. ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నవారు... చివరకు ఏ భాషా రాకుండా తయారవుతారు. ఒక భాష వికసించాలంటే శాస్త్రాలన్నింటినీ అందులోనే రాయాలి. ఆంగ్లం చదవకపోతే ఉద్యోగాలు రావనేది విద్యావ్యాపారాలు చేసేవారి తప్పుడు ప్రచారం. మాతృభాషలో విద్యాబోధన లేకపోతే 40 ఏళ్లలో అది అంతరించడం తథ్యమని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాఠ్యాంశాల్ని బోధించేవారికే ఆంగ్లం సరిగా రాదు. గతంలో జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదువుకున్నవారే పెద్దపెద్ద శాస్త్రవేత్తలయ్యారని మరవొద్దు. కర్ణాటకలో పీజీ కోర్సులనూ మాతృభాషలోనే బోధిస్తున్నారు.

- ప్రొఫెసర్‌ పులికొండ సుబ్బాచారి,విశ్రాంత ఆచార్యులు,ద్రవిడ విశ్వవిద్యాలయం

ఇది జాతి ద్రోహం

ఆంగ్లమాధ్యమంపై ప్రభుత్వ నిర్ణయం తెలుగు జాతికి ద్రోహం. తెలుగులో చదువు చెప్పేందుకు, తెలుగులో పరిపాలించేందుకే కదా... ఆంధ్రప్రదేశ్‌ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి... కొన్ని అక్షరాలు, పాటలు, పద్యాలు నేర్పిస్తామంటే భాష బతకదు. మహాత్మాగాంధీకి ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం ఉన్నప్పటికీ... ఆత్మకథను మాతృభాషలోనే రాశారు. తన అభిప్రాయాల్ని అమ్మభాషలోనే బాగా వ్యక్తం చేయగలనని చెప్పారు. అభివృద్ధిపరంగా అపూర్వ ప్రగతిని సాధించిన చైనాలో శాస్త్ర సాంకేతిక అంశాలన్నింటినీ మాండరిన్‌ భాషలోనే నేర్పుతారు. తమిళనాడులో 20 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు మాతృభాషలో చదువుకున్నవారికే ఇస్తున్నారు.

- డాక్టర్‌ సామల రమేష్‌బాబు, తెలుగుభాషోద్యమ సమాఖ్య జాతీయ అధ్యక్షులు

ఇక్కడే లేకపోతే మరెక్కడ?

తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు మాధ్యమం లేకపోతే ప్రపంచంలో ఎక్కడుంటుంది? ఎందుకుండాలి? తెలుగు మాతృభాషలోనే బోధన సాగాలి. ఒక సబ్జెక్టుగా నేర్పితే విద్యార్థులకు 300-400 పదాలే తెలుస్తాయి. భవిష్యత్తులో తెలుగు నశించేందుకు ఇదే పునాది. పరాయి రాష్ట్రాల్లో మనభాషను ప్రోత్సహిస్తుంటే... ఇక్కడ తొలగించడం ఆత్మహత్యాసదృశం.

- తూమాటి సంజీవరావు, కార్యదర్శి, చెన్నపురి తెలుగువాణి

మాతృభాషతోనే వికాసం

ప్రభుత్వ నిర్ణయం దారుణం. మాతృభాషలో బోధన వల్లే పిల్లల్లో మేధో వికాసం సాధ్యం. సొంత ఆలోచనల్ని ఇతర భాషలో చెప్పగల పరిణతి ఆ వయసులో వారికి ఉండదు. పాఠశాల విద్య తర్వాత ఆంగ్లమాధ్యమంలో బోధించవచ్చు. అదీ నిర్బంధం కాకూడదు. ప్రస్తుత ఉపాధ్యాయులు ఆంగ్లంలో ఏం బోధించగలరు? వారిని మళ్లీ కాన్వెంట్లలో చేర్పించి ఆంగ్లాన్ని నేర్పించాల్సి వస్తుంది.

- అట్టాడ అప్పల్నాయుడు, ప్రముఖ రచయిత, ఉత్తరాంధ్ర రచయితల వేదిక అధ్యక్షుడు

మాతృభాషను చంపడమే

ఆంగ్ల మాధ్యమంలో బోధన అంటే మాతృభాషను చంపడమే. ఇది ప్రాదేశిక సంస్కృతిని నాశనం చేయడమే. మన దగ్గర విదేశాలకు వెళ్లేవారు తక్కువ. తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారికి ఈ ఉద్యోగాల్లో ప్రాధాన్యమివ్వాలి. ఆంగ్లాన్ని ఒక భాషగా నేర్చుకోవచ్చుగానీ, దాని కోసం తెలుగును నాశనం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానిది అశాస్త్రీయ చర్య. తెలుగుజాతే తెరమరుగయ్యే పరిస్థితి వస్తుంది.

- ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

భాషనూ రాజకీయం చేస్తారా

చివరకు భాషనూ రాజకీయం చేశారు. తెలుగు రాష్ట్రాల విద్యారంగంలో 20 ఏళ్ల క్రితం దాకా మాతృభాష పరిఢవిల్లింది. ఈ స్ఫూర్తి కారణంగా... పశ్చిమ బెంగాల్‌లో మన పిల్లలు చదివే బడుల్లోనూ ఎనిమిదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలోనే అన్ని సబ్జెక్టులూ బోధించారు. మన పోకడల్ని చూసి అక్కడ చాలా బడుల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా మార్చేశారు.

- రాళ్లపల్లి సుందరరావు, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు

ప్రభుత్వ నిర్ణయం అసమంజసం

ఆంగ్ల మాధ్యమంలో బోధించాలనే జీవో ప్రభుత్వ దుందుడుకు చర్యకు నిదర్శనం. ఇది తెలుగు భాషకు తీరని అన్యాయం చేస్తుంది. రాష్ట్రాలన్నీ మాతృభాషలను అభివృద్ధి చేసుకుంటుంటే.. ఏపీ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధిస్తేనే విద్యార్థిలో సృజనాత్మకత వికసిస్తుందని విద్యావేత్తలు గుర్తు చేస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో అభ్యాసానికి అనుకూల వాతావరణం ఉండదు. దీని వల్ల వారు పాఠశాల మానేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అక్షరాస్యతలో, విద్యా ప్రమాణాల్లో అట్టడుగున ఉన్న ఏపీ మరింత అధ్వాన స్థితికి వచ్చే ప్రమాదముంది. ఉపాధ్యాయులు దశాబ్దాలుగా తెలుగులో పాఠాలు చెప్పి ఒక్కసారిగా ఆంగ్ల మాధ్యమంలో బోధించగలరా? ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని అందరూ కోరుకుంటే.. వాటికి హాని కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. భావితరాలను ప్రభావితం చేసే నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలి. ఏపీలోని కోట్లాది తెలుగు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి.

- ప్రకటనలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

ఏకపక్ష నిర్ణయం తగదు

ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే చేయాలని జాతీయ స్థాయి కమిటీలు చెబుతుంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వానికి తగదు. రాజ్యాంగంలోని 350 అధికరణం ప్రకారం భావ వ్యక్తీకరణకు మాతృభాషే ప్రాణం. ప్రాథమిక స్థాయిలో మాతృ భాషలో బోధనకు సౌకర్యాలు కల్పించాల్సిందే.

- ఏపీ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గణపతిరావు, ప్రకాశ్‌రావు

భాష మరుగున పడుతుంది..

తెలుగును ఒక సబ్జెక్టుగా మాత్రమే పరిగణించడం వల్ల వందల ఏళ్లుగా అభివృద్ధి చెందిన భాష మరుగున పడుతుంది. ప్రపంచంలో ఏ దేశమూ మాతృభాషను దూరం పెట్టలేదు. తెలుగు భాషను కించపరిచేలా ప్రభుత్వ నిర్ణయం ఉంది.

- ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణరెడ్డి, నరహరి

విద్యాహక్కు చట్టం అపహాస్యం

ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణం. విద్యాహక్కు చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు. మాతృభాషను గౌరవించడమే చైనా, జపాన్‌ వంటి దేశాల అభివృద్ధికి కారణం. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించి తీరాల్సిందే.

- తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, జింకల సుబ్రహ్మణ్యం

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు